సత్యా నాదెళ్లకు ట్యూషన్‌.. వరుణుడిపై యుద్ధం..!!

26 Jun, 2018 18:20 IST|Sakshi

సాక్షి, అమలాపురం (తూర్పు గోదావరి) : 2014 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఉద్దేశించి ప్రజాసంకల్పయాత్ర 199వ రోజు అమలాపురం బహిరంగ సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిన్నపాటి కథను చెప్పారు.

‘ఒక మోసపూరిత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మనకు ప్లాట్లను అమ్మేందుకు ఇక్కడికి సమీపంలో ఎయిర్‌పోర్టు వస్తుంది అంటాడు. పక్కనే అదిగదిగో రింగ్‌ రోడ్డు అంటాడు. ఇక్కడే ఐటీ హబ్‌ వస్తుంది అంటాడు. 100 అంతస్తుల భవనాలు సైతం వస్తున్నాయంటాడు. ఇక్కడ నుంచి ఒక కిలోమీటరు దూరం పోతే పక్కనే ఇండస్ట్రియల్‌ కారిడార్‌ వస్తుందంటాడు. ఆసియాలోనే అతిపెద్ద షాపింగ్‌ మాల్‌ వస్తుందని అంటాడు.

అంతటితో ఆగడు. ఇక్కడే మల్టీప్లెక్స్‌ కూడా వస్తోందని చెబుతాడు. కొత్త సినిమా విడుదల కాగానే, తొలి షో ఇక్కడే పడుతుందంటాడు. అంతటితో ఆగడు ఆ మోసపూరిత వ్యాపారి. మీరు ఈ రోజు పెట్టుబడి పెట్టే డబ్బు 4 నెలల్లో పది రెట్లు పెరుగుతుందంటాడు. నమ్మి మనం భూమిని కొంటాం. నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆ భూమిలో పిచ్చి మొక్కలు తప్ప ఏమీ కనిపించవు.

ప్రజలేమో ఎక్కడబ్బా ఎయిర్‌పోర్టు, రింగ్‌ రోడ్డు, ఐటీ హబ్‌, షాపింగ్‌ మాల్‌, మల్టీఫ్లెక్స్‌ అని ఎదురుచూస్తుంటారు. ఆ భూమిలో పిచ్చి మొక్కలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఐదో ఏడాది వచ్చేసరికి ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇంకో వెంచర్‌ వేస్తాడు. మళ్లీ ఇవే మాటలు చెప్పడం మొదలుపెడతాడు. మళ్లీ ప్రజలకు అమ్మాలని ప్రయత్నిస్తాడు. ఇది ఒక చిన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ప్రజలను మోసగించే కథ. ఇలా మోసం చేసే వారిని మనమంతా నాటుగా 420 అని పిలుస్తాం.

నాలుగు ఏళ్లుగా సీఎంగారు మనకు చూపిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ సినిమాను గమనించండి. మన పెద్ద మనిషి అదిగదిగో సింగపూర్‌ లాంటి రాజధాని అంటాడు. అదిగదిగో అక్కడ పోలవరం. ఇదిగో రేపు ఆరు నెలలలో, ఏడాదిలో పూర్తి అవుతుంది అని చెప్తాడు. ఇదిగో ఇక్కడే ఐకానిక్‌ టవర్‌. ఆ పక్కనే ఐకానిక్‌ బ్రిడ్జి. దాని పక్కనే సిలికాన్‌ వ్యాలీ. దాని పక్కనే లెఫ్ట్‌ తీసుకుని, రైట్‌కు తీసుకుంటే 100 అంతస్తుల బిల్డింగ్‌. దాని పక్కనే బుల్లెట్‌ రైలు, దాని పక్కనే హైపర్‌ లూప్‌. దానికి ఆనుకుని మైక్రోసాఫ్ట్‌ . దానిలో సత్య నాదెళ్ల కనిపిస్తాడు. చంద్రబాబు ట్యూషన్‌ చెబుతూ ఉంటాడు. అంతటితో చంద్రబాబు సినిమా ఆగదు.

దేశం 7 శాతం అభివృద్ధి సాధిస్తోంటే, మన రాష్ట్రం దేశం కన్నా డబుల్‌ వేగంతో అభివృద్ధి చెందుతోందని అంటాడు. అక్కడితో ఆగడు. చిటికెస్తే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయంటాడు. జేబులో పెన్ను తీస్తే 40 లక్షల ఉద్యోగాలు వస్తాయంటాడు. చంద్రబాబు చూపిస్తున్న నాలుగేళ్ల సినిమా ఇంకా పూర్తికాలేదు. అనంతపురం కరువును రెయిన్‌ గన్స్‌తో జయించాడట. వర్షం దేవుడి మీద యుద్ధం చేశాడట. రెయిన్‌ గన్స్‌ ద్వారా వరుణదేవుడిని ఓడించాడట. ఇంకా కాలేదు. దోమల మీద యుద్ధం. దోమలను చంపేసే సూపర్‌ డ్రోన్స్‌ అట. సినిమా రసవత్తరంగా ఉంది కదూ.

నాలుగేళ్లుగా ఈ పెద్దమనిషి మనకు ఒక మోసపూరిత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాదిరిగా చంద్రబాబు సినిమా చూపిస్తున్నాడు. మరోవైపున రాష్ట్ర నిజస్వరూపం ఘోరంగా ఉంది. రైతులు ఆత్యహత్యల మొదలు నిరుద్యోగుల ఆకలి కేకలు, అక్కచెల్లెమ్మల మాన, ప్రాణాలతో ఆడుకుంటున్నారు. జన్మభూమి కమిటీలతో ప్రజలు ఆర్తనాదాలు పెడుతున్నారు. చంద్రబాబు పాలనలో దేశంలో ఎక్కడాకూడా కనివినీ ఎరుగని అవినీతిని చూస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలకు తాకట్టుపెట్టారు.

నాలుగేళ్లుగా రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. ఒక్కసారి వీటన్నింటిని గమనించండి. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల బాదుడు మామూలుగా లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అనే గొప్ప పథకానికి పూర్తిగా ఎగనామం పెడుతున్నారు. ఉద్యోగాలా? అని ఎక్కడున్నాయి అని వెతుక్కనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. పేదవాడికి ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేవు. వర్షాలు, ఎండలకు ఎలా బ్రతకాలనే ఆందోళనలో పేదలు ఉన్నారు. ఆరోగ్య పథకం పూర్తిగా అటకెక్కింది. విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతున్నారు. పిల్లల్ని సైతం తాగుబోతుల్ని చేస్తున్నారు. మన కళ్ల ఎదుటనే మట్టిని ఇసుకను దోచుకుతింటున్నారు.’ అని వైఎస్‌ జగన్‌ రాష్ట్ర పాలనపై కథను ముగించారు.

మరిన్ని వార్తలు