గుక్కెడు నీళ్లూ.. ఇవ్వడం లేదన్నా..

16 Apr, 2018 01:47 IST|Sakshi
ముత్యాలంపాడు క్రాస్‌ వద్ద ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

నాలుగేళ్లుగా కష్టాలేనంటూ జననేతతో వాపోయిన జనం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. మా మైలవరం నియోజకవర్గానికి జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ మా గ్రామాల్లో తాగేందుకు నీరు లేదు. చెరువులు ఎండిపోవడంతో పశువులకు కూడా నీరుండటం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సాగర్‌ నీరు తీసుకువస్తానని ఆయన గొప్పలు చెప్పాడు. ఇప్పుడు నీటి విషయమే ఎత్తడు. సాగుకు కూడా నీటి కరువే. నాలుగేళ్లుగా అన్నీ కష్టాలే’అని గంగినేని, మునగపాడు, దుగ్గిరాలపాడు, చెవుటూరు గ్రామాల రైతులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయారు.

150 అడుగుల వరకు బోర్లు వేసినా నీరుపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 137వ రోజు ఆదివారం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు  జగన్‌మోహన్‌రెడ్డికి వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను ఏకరువుపెట్టారు. ఆదివారం ఉదయం విజయవాడ శివారులోని వైఎస్సార్‌ కాలనీ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు పల్లె పల్లెనా ప్రజానీకం నీరాజనాలు పలికింది. పనులు పక్కన పెట్టి కార్మికులు, కర్షకులు, కూలీలు, మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.

సమీపంలోని వవులూరు, చావాడ, పైడూరుపాడు, రాయనపాడు, గొల్లపూడి, భవానీపురం, నైనవరం, నున్న నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పాదయాత్ర కొత్తూరు తాడేపల్లి చేరుకున్నప్పుడు జై జగన్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వెలగలేరు సెంటర్‌ అయితే జన సంద్రమే అయింది. మహిళా కూలీలు మామిడి తోటల్లో పనులు వదిలేసి వచ్చి జననేతతో తమ బాధలు చెప్పుకున్నారు. పలు గ్రామా ల్లో జనం టీడీపీ నేతల అక్రమాలను, దౌర్జ న్యాలను వివరించారు.

మరిన్ని వార్తలు