మా లెక్కలు మాకున్నాయి..: చినరాజప్ప

18 Apr, 2019 15:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికలు ముగిసినప్పటికీ అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తున్న టీడీపీ సర్కార్‌... ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా లేవని నిందలు వేస్తున్నారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని, కావాలనే లా అండ్‌ ఆర్డర్‌ సమస్యలు సృష్టిస్తున్నారని చినరాజప్ప విమర్శలు గుప్పించారు. 

గుంటూరులో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డాయని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో సమస్యలు తలెత్తినా టీడీపీ కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారని చెప్పుకొచ్చారు. పోలింగ్‌ రోజు ఎన్నికల కమిషన్‌ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికలు కోడ్‌ అమల్లో ఉన్నా ప్రజల సమస్యలపై సమీక్షలు చేయవచ్చని చినరాజప్ప సమర్థించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని... ‘మా లెక్కలు మాకున్నాయి...ఖచ్చితంగా 115 నుంచి 120 సీట్లలో గెలుస్తాం.’  అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు