‘డీజీపీ నోట ఆ మాటలు విని సిగ్గుపడ్డాను’

11 Nov, 2018 09:46 IST|Sakshi

వైఎస్‌ఆర్‌సీపీ నేత, రిటైర్డ్‌ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం

సాక్షి, గుంటూరు: ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై డీజీపీ మాట్లాడిన మాటలు విని ఓ పోలీస్‌ ఆఫీసర్‌గా సిగ్గుపడ్డానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, రిటైర్డ్‌ డీఐజీ చంద్రగిరి ఏసురత్నం తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తను రెండు సార్లు టీడీపీ తరపున నామినేషన్‌ వేసేంతవరకు వెళ్లానని, కానీ ఆ పార్టీ డబ్బులు డిమాండ్‌ చేయడంతో పోటీ చేయలేకపోయానన్నారు. వైఎస్‌ జగన్‌తో కేవలం మూడు నిమిషాలే మాట్లాడనని, వారం రోజుల్లో ఎమ్మెల్యే టికెట్‌పై హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రెడ్డి, ఎస్సీ, ముస్లింల ఓట్లు ఒక పథకం ప్రకారం తొలగించారని ఆరోపించారు. కేవలం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే 42 వేల ఓట్లు తొలగించారని, అయినా తొలగించిన ఓట్లకు 5 వేల ఓట్లు కలిపి కొత్తగా నమోదు చేయించామన్నారు.

వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై రాష్ట్ర పోలీసులు ఆ ఘటన ఎయిర్ పోర్టులో జరిగిందని, తమ పరిధిలోకి రాదంటున్నారని కానీ రాష్ట్రంలో ఎక్కడ ఏ నేరం జరిగిన దానికి  పోలీసులే బాధ్యత వహించాలన్నారు. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో కేవలం 307 సెక్షన్ మాత్రమే పెట్టారని, కుట్ర అని తెలిపే 120 డీ సెక్షన్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎల్లప్పుడూ మీరు అధికారంలో ఉంటారని కలలు కనవద్దని,  నాలుగు నెలల్లో ఓడలు, బళ్లు అవుతాయి బళ్ళు ఓడలవుతాయన్నారు. ప్రభుత్వం మాట విని ఓట్లు తొలగిస్తే అధికారులు ఇబ్బంది పడతారని, సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు