బాబు నవరత్నాలను కాపీ కొట్టారు

6 Apr, 2019 08:59 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి

మార్కాపురం: నవరత్నాల పథకాలను సీఎం చంద్రబాబు కాపీ కొట్టి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేందుకు కలలు కంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. చంద్రబాబు మళ్లీ సీఎం కావడం ఎప్పటికీ జరగదని చెప్పారు. శుక్రవారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలన్నీ నవరత్నాల్లో నుంచి కాపీ కొట్టినవేనని ఆమె స్పష్టం చేశారు.

వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు 70 ఏళ్ల చంద్రబాబు ఇతర నాయకులతో కలసి లేని, పోని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నాడని, అయినా 11న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి స్పీడుకు సైకిల్‌కు బ్రేకులు పడతాయన్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్‌ను సీఎం చేయాలని నిర్ణయించుకున్నారని చంద్రబాబు ఆయన వర్గీయులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మరని చెప్పారు. జగన్‌ చేసేవే చెబుతారని, చంద్రబాబులా 630 హామీలు ఇవ్వలేదన్నారు. 40 ఏళ్ల కొడుకును (లోకేష్‌ను) సీఎం చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదని విమర్శించారు.

అమరావతిని భ్రమరావతిగా మార్చి కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్లను తాత్కాలిక కట్టడాలకు ఖర్చు చేయటం మంచిదా అని ప్రశ్నించారు. రాజధాని డిజైన్‌కే రూ.235 కోట్లు కేటాయించి ఆ నిధులను హైదరాబాదులో ఇళ్లు కట్టుకునేందుకు ఖర్చు చేయటం మంచి పద్ధది కాదన్నారు. పట్టిసీమలో రూ.400 కోట్ల దోపిడీ జరిగిందని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. పోలవరానికి రూ.7 వేల కోట్లు ఇచ్చినా ఇంత వరకు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ పంపలేదని, అది పంపి ఉంటే ఇంకా ఎక్కువ నిధులు వచ్చేవని అభిప్రాయపడ్డారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మీర్జా షంషీర్‌ అలీబేగ్‌ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు