‘క్రిమినల్‌ కేసులున్న పోలీసులకు పోస్టింగులు’

21 Mar, 2019 16:59 IST|Sakshi

సాక్షి, విజయవాడ : అధికార తెలుగు దేశం పార్టీ ఎన్నికల నిబంధనలను పట్టించుకోవడం లేదని, క్రిమినల్ కేసులు ఉన్న పోలీస్ ఆఫీసర్లకు ఎన్నికల బాధ్యతలు అప్పగించకూడదని వున్నా.. వారికి పోస్టింగులు ఇచ్చారని వైఎస్సార్‌ సీపీ ఎన్నికల నిబంధనల నిఘా కమిటి సభ్యుడు నాగిరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ట్విటర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కామెంట్స్ ట్యాగ్ చేస్తున్నారని చెప్పారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటివరకు వెయ్యి మాత్రమే రైతుల ఖాతాలో జమైనా.. 15 వేల రూపాయలు రైతులకు ఇచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తరువాత
ముగ్గురు ఐపీఎస్‌లకు అడిషనల్ డీజీ పదోన్నతులు ఇచ్చారని తెలిపారు. వీటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

ఆ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు : గౌతంరెడ్డి
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆర్థికపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని వైఎస్సార్‌ సీపీ ఎన్నికల నిబంధనల నిఘా కమిటీ సభ్యుడు గౌతంరెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే ప్రతిపని ఎన్నికల నిబంధనల ప్రకారం జరగాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోటోలతో కూడిన భారీ కటౌట్లు పెట్టారని, వెంటనే వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు