శంకరనారాయణ అనే నేను..

8 Jun, 2019 10:31 IST|Sakshi

పెనుకొండ ఎమ్మెల్యేకు మంత్రి పదవి

బీసీ నేతకు పెద్దపీట వేసిన సీఎం వైఎస్‌ జగన్‌

2014 ఎన్నికల సమయంలోనే మంత్రిని చేస్తానని హామీ

ఇచ్చిన మాటకు కట్టుబడిన ముఖ్యమంత్రి

సౌమ్యుడిగా శంకరన్నకు ప్రజల్లో గుర్తింపు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు చోటు దక్కింది. రాజధాని అమరావతిలో నేడు జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. జిల్లాకు దక్కిన ఒకే మంత్రి పదవిని బీసీలకు కేటాయించడంతో వెనుకబడిన వర్గాలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లయింది. దీంతో పాటు శంకర్‌నారాయణను గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని 2014లో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చినట్లయింది. శంకర్‌నారాయణ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా దాదాపు ఏడేళ్లు పనిచేశారు. ఆ తర్వాత హిందూపురంపార్లమెంట్‌ అధ్యక్షుడిగా సేవలందించారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున బరిలోకి దిగారు. 17,415 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పార్థసారథికి 79, 793 ఓట్లు పోలైతే, శంకర్‌నారాయణకు 62,378 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి పెనుకొండ బరిలో నిలిచి 16,494 ఓట్లు సాధించారు. అప్పట్లో రఘువీరా బరిలో లేకపోతే శంకర్‌నారాయణ గెలిచే వారనే చర్చ నడిచింది. ఈ దఫా ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,058 ఓట్లతో శంకరనారాయణ విజయం సాధించారు. సౌమ్యుడిగా, చిన్నా పెద్ద తేడా లేకుండా కలుపుగోలుగా వ్యవహరించే వ్యక్తిగా ఆయనకు పేరుంది.

‘అనంత’లో బీసీలకు పెద్దపీట: అనంతపురం జిల్లాలో బీసీలకు జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి పెద్దపీట వేస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బీసీ నేత పైలా నర్సింహయ్యను మొదట కొనసాగించారు. తర్వాత శంకరనారాయణకు సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం, అనంతపురం రెండు ఎంపీ స్థానాల్లో సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన గోరంట్ల మాధవ్, తలారి రంగయ్యలకు టిక్కెట్లు ఇచ్చి ఎంపీలుగా గెలిపించారు. దీంతో పాటు పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ టిక్కెట్లను శంకర్‌నారాయణ, ఉషాశ్రీచరణ్, కాపు రామచంద్రారెడ్డిలకు ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీసీ కోటాలో శంకర్‌నారాయణకు చోటు కల్పించారు. జిల్లాలో బోయ, కురుబతో పాటు బీసీలు మొత్తం మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచారు. దీంతో జిల్లాలో బీసీలకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట వేసినట్లయింది. మంత్రివర్గంలో కూడా అత్యధికంగా బీసీలకు చోటు కల్పించారు. వైఎస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయాల పట్ల బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

23ఏళ్ల తర్వాత పెనుకొండకు మంత్రి పదవి
పెనుకొండ: పెనుకొండ నియోజకవర్గానికి 23 ఏళ్ల తర్వాత మళ్లీ మంత్రి పదవి లభించింది. 1996లో అప్పటి పెనుకొండ ఎమ్మెల్యే దివంగత పరిటాల రవీంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకు ముందు 1987–89 మధ్యకాలంలో ఎస్‌.రామచంద్రారెడ్డి పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. తాజా ఎన్నికల్లో టీడీపీ సీనియర్‌ నేత బీకే పార్థసారథిపై వైఎస్సార్‌సీపీ తరపున గెలుపొందిన మాలగుండ్ల శంకర్‌నారాయణను మంత్రి పదవి వరించింది.

బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తా 
నాకు మంత్రి పదవి ఇవ్వడం బీసీలకు జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా. హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తా. నన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజలు, అండగా నిలిచిన తోటి ఎమ్మెల్యేలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లాలో పెండింగ్‌లోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రథమ కర్తవ్యం. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించి, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తా. తోటి ఎమ్మెల్యేల సహకారంతో ముందుకెళ్తా.– శంకర్‌నారాయణ, మంత్రి, పెనుకొండ ఎమ్మెల్యే  

ప్రొఫైల్‌
పేరు: మాలగుండ్ల శంకర నారాయణ
విద్యార్హత: బీకాం, ఎల్‌ఎల్‌బీ
తండ్రి: మాలగుండ్ల వకీలు పెద్దయ్య,  మున్సిపల్‌ మాజీ చైర్మన్, ధర్మవరం
తల్లి: యశోదమ్మ
సతీమణి: జయలక్ష్మి
సోదరులు : మాలగుండ్ల రవీంద్ర, మాలగుండ్ల మల్లికార్జున
పిల్లలు: మాలగుండ్ల పృద్వీరాజ్, నవ్యకీర్తి

రాజకీయ నేపథ్యం
1995లో టీడీపీ జిల్లా కార్యదర్శి
2005లో ధర్మవరం మున్సిపల్‌ కౌన్సిలర్‌
2011లో వైఎస్సార్‌సీపీలో చేరిక
2012లో పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు
2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి
2019లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై 15,041 ఓట్లకు పైగా మెజార్టీతో ఘన విజయం.

మరిన్ని వార్తలు