‘వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కచ్చితంగా కుట్రే’

25 Oct, 2018 18:15 IST|Sakshi
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఆయన అభిమానే అని టీడీపీ నేతలు, పోలీసులు చెప్పడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్‌ ద్వారా తప్పుబట్టారు. పబ్లిసిటీ కోసమే దాడి జరిగిందని చెప్పడాన్ని ఖండించారు. ఎయిర్‌పోర్టులో జరిగింది కాబట్టి అది పోలీసుల బాధ్యత కాదని టీడీపీ నేతలు చెప్పడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్నారు. హత్యాయత్నం ఘటనపై విచారణ చేయకముందే ఏపీ డీజీపీ చేసిన వ్యాఖ్యలతో కుట్రను నీరుగార్చే ఉద్దేశం స్పష్టమవుతోందని వెల్లడించారు.

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన ఎయిర్‌పోర్టు తమ పరిధిలోనికి రాదని డీజీపీ చెప్పారు.. మరి ప్రత్యేక హోదా ర్యాలీ కోసం వైఎస్‌ జగన్‌ విశాఖపట్నం వెళ్తున్నప్పుడు ఆయన ఎయిర్‌పోర్టు రన్‌వే వద్ద మఫ్టీ పోలీసులు బయటకు రాకుండా ఎలా అడ్డుకున్నారని ప్రశ్నించారు. అది మీ పరిధి కాదని అప్పుడు పోలీసులకు తెలియలేదా అని సూటిగా అడిగారు. వైఎస్‌ జగన్‌ భద్రత, రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాలని, గతంలో చేసిన అనేక విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. చివరకు ఆయన ప్రయాణించే వాహనాలు సైతం తరచుగా మరమ్మతులకు గురవుతున్నా, మొరాయిస్తున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం వెనక ప్రభుత్వ ఉద్దేశం ఇదేనా అని అనుమానం వ్యక్తం చేశారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోనే ఆయనపై కత్తితో జరిగిన దాడి కచ్చితంగా కుట్రేనని, ఆ కుట్ర వెనక ఎవరున్నారో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. అసలు ఎయిర్‌పోర్టులోకి కత్తి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. శ్రీనివాస్‌ అనే వ్యక్తి తెలుగుదేశం నాయకుడి క్యాంటీన్‌లో పని చేస్తున్నారని, ఒక సెల్ఫీ తీసుకుంటానని అభ్యర్థన చేసినట్లు వెల్లండించారు. సెల్ఫీ తీసుకుంటా అని నటించి మెడపైన దాడి చేసి ఒక్క వేటులో చంపాలని ప్రయత్నించాడని.. భగవంతుడి దయ వల్ల వైఎస్‌ జగన్‌ తృటిలో తప్పించుకున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దీవెనల ఉండటం వల్లే వైఎస్‌ జగన్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారని అన్నారు. ప్రజల ప్రేమాభిమానాలే వైఎస్‌ జగన్‌కు రక్షణగా నిలుస్తాయని, ఏపీని అగ్రగామిగా నిలబెట్టాలన్న వైఎస్‌ జగన్‌ ఆకాంక్షను ఇలాంటి స్వార్థ, కుట్రపూరిత దాడులు ఆపలేవని అన్నారు.

>
మరిన్ని వార్తలు