కాంగ్రెస్ సీనియర్ నేతలతో సోనియా గాంధీ కీలక భేటీ

4 Dec, 2023 19:51 IST|Sakshi

ఢిల్లీ: మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ సమావేశాన్ని సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు శశిథరూర్, చిదంబరం, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సహా తదితర నాయకులు భేటీలో పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిపినట్లు సమచాారం.

మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పట్టు సాధించింది. తెలంగాణలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఉపశమనం లభించింది. అయినప్పటికీ పెద్ద రాష్ట్రాల్లో పట్టు కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహలను మార్చనుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అటు.. నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. తదితర పరిణామాలపై భేటీలో చర్చ జరిగిందని సమాచారం.

2024 ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేసే దిశగా కాంగ్రెస్ నేతృత్వంలో దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇండియా కూటమిగా పేరుతో ప్రజల ముందుకు వెళ్లనున్నాయి. పాట్నా, బెంగళూరు, ముంబయిల్లో ఇప్పటికే మూడు సమావేశాలు కూడా నిర్వహించారు. కూటమి సమన్వయ కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. కానీ పలు రాష్ట్రాల్లో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఎటూ తేలలేదు. ఈ క్రమంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది.  ఈ ఓటమి ఇండియా కూటమి కాంగ్రెస్ పెద్దన్న పాత్రకు ఎదురుదెబ్బగా మారింది.   

ఇదీ చదవండి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!?

>
మరిన్ని వార్తలు