-

చంద్రబాబు మహిళా ద్రోహి

11 Mar, 2018 01:05 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా ద్రోహి, మహిళలకు మేలు చేసేందుకు ఆయనకు చేతులు రావని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు. ఆఖరి బడ్జెట్‌లో కూడా మహిళలకు మొండి చెయ్యి చూపించారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రుణమాఫీకి రూ. 14,200 కోట్లు కావాలని, కానీ ఇచ్చిన మాటను చివరి బడ్జెట్‌లో కూడా నెరవేర్చకపోవడం దుర్మార్గమన్నారు.

వడ్డీ లేని రుణాలకు రూ. 2,400 కోట్లు అవసరమైతే..  రూ. 1,400 కోట్లు కేటాయించారని, అవి ఏ మూలకు సరిపోతాయని మండిపడ్డారు. బెల్ట్‌షాపులను దశల వారిగా ఎత్తేస్తామన్నారని, అయితే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జాతీయ రహదారుల వద్ద, అన్ని గ్రామాల్లో విచ్చల విడిగా మద్యం దుకాణాలు పెట్టి దోచు కుంటున్నారని రోజా ధ్వజమెత్తారు. ఆడపిల్ల పుడితే రూ. 30 వేలు వేస్తా మని బాబు గొప్పగా మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టాడని, పండం టి పథకం కింద గర్భిణులకు రూ.10 వేలు ఇస్తామన్నారని.. ఈ నాలుగేళ్లలో ఒక్క ఆడపిల్లకైనా డబ్బులు వేశారాని ఆమె నిలదీశారు. కళాశాల విద్యార్థినులకు ఐప్యాడ్‌లు, మహిళలకు సెల్‌ఫోన్‌లు, విద్యార్థినులకు సైకిళ్లు కొనిస్తానన్న హామీల్లో ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదన్నారు. బాబు ఇంట్లో  ఆడవాళ్లు వ్యాపారాలు చేస్తే మహిళా సాధికారత సాధించినట్లేనా అని ప్రశ్నించారు.

మహిళలపై పెరుగుతున్న అకృత్యాలు.. 
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రపంచంలోనే మహిళల అక్రమ రవాణాలో ఏపీ రెండవ స్థానంలో ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు