కే ట్యాక్స్‌పై అసెంబ్లీలో చర్చిస్తాం

15 Jul, 2019 03:39 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి

నరసరావుపేట రూరల్‌: ‘కోడెల ట్యాక్స్‌’ (కే టాక్స్‌)పై రాష్ట్ర అసెంబ్లీలో చర్చించనున్నట్టు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామ్, కుమార్తె విజయలక్ష్మి సాగించిన అవినీతి, అక్రమాలపై శాసనసభలో చర్చిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడెల కుటుంబం అవినీతిపై వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయని వివరించారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

తన కుటుంబంపై కక్ష సాధింపులో భాగంగా కేసులు నమోదు చేస్తున్నారని మాజీ స్పీకర్‌ కోడెల పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే, కే టాక్స్‌ బాధితులందరూ తెలుగు దేశం పార్టీకి చెందిన వారేనని గుర్తు చేశారు. కళ్ల ముందు కనిపిస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకుంటూ వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేయడాన్ని మానుకోవాలని కోడెలకు హితవు పలికారు. కోడెల అక్రమాలన్నింటిపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. అలాగే పట్టణంలోని ట్రాఫిక్‌ ఆంక్షలపై టీడీపీ నేతలు విమర్శించడం తగదని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు కలిగే మార్పులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌ ప్రజా సంక్షేమ బడ్జెట్‌ అని ఎమ్మెల్యే గోపిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రంగాలకు కేటాయింపులు జరిపారన్నారు.

మరిన్ని వార్తలు