పెట్టింది వైఎస్సార్‌.. పీకేది చంద్రబాబే

11 May, 2018 13:59 IST|Sakshi

టీడీపీ అధినేతకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ఎంపీ

సాక్షి, విజయవాడ: నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉందనే చంద్రబాబు నాయుడు.. జీవితంలో నేర్చుకున్నది ఏమీలేదు కాబట్టే ఇంకా దుర్భాషలాడే స్థాయిలో ఉన్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ పి. వరప్రసాద రావు అన్నారు. ముఖ్యమంత్రి వినియోగించిన ‘పీకుడు’  పదాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే, పీకేవాళ్లెవరో, పెట్టేవాళ్లెవరో ఇట్టే తేల్చయవచ్చని చెప్పారు. విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సంబోధించింది మహానేత వైఎస్సార్‌నా, లేక వైఎస్‌ జగన్‌నా తెలియకున్నా తాను మాత్రం సమాధానం చెబుతానని వరప్రసాద్‌ అన్నారు. జగన్‌ ఇంకా అధికారం చేపట్టలేదన్న సంగతి గుర్తుచేసిన ఆయన.. టీడీపీది పీకే రాజకీయమైతే.. వైఎస్సార్‌సీపీది పెట్టే రాజకీయమని స్పష్టం చేశారు.

పీకేది చంద్రబాబే:
గడిచిన నాలుగేళ్లలో చంద్రబాబు నాయుడు 10 లక్షల పెన్షన్లను పీకేశారు. వృధాప్య పెన్షన్‌ వయసును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచి పెన్షన్లు పీకేశారు.
దాదాపు 10 లక్షల మంది పేదల రేషన్‌ కార్డుల్ని పీకేశారు.
2 లక్షల మంది కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను విధుల నుంచి పీకేసిన ఘటన బాబుదే
తాను సీఎంగా ఉన్న కాలంలో 60కిపైగా ప్రభుత్వ సంస్థలను పీకేశారు.. అంటే మూసేశారు.
నాడు గొప్పగా అమలైన ఉచిత విద్యుత్‌ పథకాన్ని పీకేశారు.
జన్మభూమి కమిటీల పేరుతో దుర్మార్గపు కమిటీలను వేసి జనాన్ని పీక్కుతింటున్నారు.
మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానీ, కలెక్టర్‌గానీ పేదలకు ఇల్లో, ఇంకేదో సాయం చేసే స్థితిలోలేరు.. ఎందుకంటే వాళ్ల అధికారాలన్నీ మీరు పీకేశారు.. వాటిని జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు.
ఇంత అహంకారంతో మాట్లాడే మిమ్మల్ని ప్రజలే పీకేసే రోజు వస్తుంది.

పెట్టింది వైఎస్సారే:
ఈ రాష్ట్ర ప్రజలకు ఏ ముఖ్యమంత్రైనా మంచి చేశారంటే అది ఒక్క వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిగారు మాత్రమే.
ఆయన పేదల కోసం ఆరోగ్యశ్రీని పెట్టారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకులాల పేద పిల్లల చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పెట్టారు.
డ్వాక్రా మహిళలకు పావల వడ్డీ పథకం పెట్టి వారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు.
2004-2008 మధ్య కాలంలో అంబులెన్స్‌లు, మందుల సరఫరా ఎలా జరిగిందో ప్రజలకు గుర్తుంది.
నా నియోజకవర్గం(తిరుపతి పార్లమెంట్‌ పరిధి)లో మూడు ఎస్‌ఈజెడ్‌లు పెట్టారు. తద్వారా వందలాది పరిశ్రమలు, వేల మందికి ఉపాధి కల్పించారు.
అసమర్థత.. ఇష్టారీతి ప్రవర్తన@బాబు
ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని ఇసుమంతైనా గౌరవించని వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీ అసమర్థత వల్లే ప్రత్యేక హోదా రాలేదు. మా ఎమ్మెల్యేలను కొని, వాళ్లను మంత్రులు చేశారు. ఇష్టారీతిగా నియంతమాదిరి వ్యవహరిస్తున్నారు. మీకు ప్రజాస్వామ్యం పట్ల విలువలేదని తెలుసుకాబట్టే మేం(వైఎస్సార్‌సీపీ) అసెంబ్లీనిని బహిష్కరించాం. కేంద్రం నుంచి వచ్చే నిధులను మీ పేరున్న పథకాలుగా చెప్పుకోవడంకాదు.. ఈ జీవితం మొత్తంలో ప్రజలకు నేనిది చేశాను.. అని చెప్పగలిగే ధైర్యం చంద్రబాబుకు లేదు. కాబట్టే ఆయన దుర్భాషలకుదిగుతున్నారు’’ అని వరప్రసాద్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు