ఐదుకోట్ల మంది.. ఆంధ్రులకు తలవంపులు

12 Mar, 2019 08:36 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

సాక్షి, శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అవినీతిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా రాష్ట్రాన్ని నిలిపిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అలా ప్రవర్తించి ఐదుకోట్ల మంది ఆంధ్రులకు చంద్రబాబు తలవంపులు తెచ్చారని వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టి ఐదేళ్లు తన ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చెప్పాల్సింది పోయి పనికిరాని కాకమ్మ కబుర్లు చెప్పడం సీఎం స్థాయి వ్యక్తికి  సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంటరిగానే పోటీ చేస్తానని ఇతరులతో జతకట్టనని ఎప్పుడో చెప్పారన్నారు. ఇతరులతో కలిసి పోటీ చేయడం గెలవడం..నాలుగేళ్ల పాటు కలిసి ఉండడం తరువాత వదిలేయడం చంద్రబాబుకు పరిపాటని విమర్శించారు. టీడీపికి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌తో బాబు జతకట్టవచ్చు గానీ కేసీఆర్, మోడీలతో మాట్లాడితే లేనిపోని అభాండాలు వేసి ఇష్టం వచ్చినట్లు తన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల చేత పిచ్చికూతలు కూయించడం చంద్రబాబుకు అలవాటన్నారు. 

భ్రమ నుంచి బయటపడాలి 
టీడీపీ ఐదేళ్ల పాలనలో అవినీతి, అరాచకం, మోసం, దోపిడీ తప్ప మరే విధంగా అభివృద్ధి జరగలేదని పాలన అంతా వైఫల్యాలమయంగా మిగిలిపోయిందని 29రాష్ట్రాల్లో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ఏదో ఒక విధంగా మళ్లీ అధికారం చేపట్టాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రజల ఎదుట మొసలికన్నీరు కారిస్తే ఓట్లు వేస్తారన్న భ్రమ నుంచి చంద్రబాబు బయటికి రావాలని హితవు పలికారు.

వైఎస్సార్‌సీపీ ఓట్ల తొలగింపు అన్యాయం
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి   ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రలో   సంక్షేమ పథకాలను రూపొందించారన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి పాదయాత్రకు వచ్చి ప్రజాదరణను చూసి ఓర్వలేక..ఏం చేయాలో తోచక వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అవస్థల పలు చేయడం వంటివి చంద్రబాబుకు తగదన్నారు.  ఇటువంటి కుళ్లు  రాజకీయాలు చేసిన చంద్రబాబును ప్రజలు క్షమించరని జోస్యం చెప్పారు. చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న బాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.

విహార యాత్రలతో కాలక్షేపం 
ఐదేళ్లలో రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు విమానయాత్రలు, బోటు షికార్ల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. దీంతో విసుగెత్తిన ప్రజలు ‘నిన్నునమ్మం బాబూ’ అని చెప్పకనే చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో నాలుగున్నరేళ్లు గుర్తుకురాని సంక్షేమ పథకాలన్నింటినీ చివరి రెండు నెలల్లో ఇష్టం వచ్చినట్లు పంచిపెడితే ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. 

జన్మభూమి కమిటీల దోపిడీ
కేంద్రప్రభుత్వం విడుదల చేసిన కోట్లాది రూపాయల  ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో చేపట్టిన నీరు–చెట్టు, సిమెంట్‌ రోడ్ల పనుల పేరుతో జన్మభూమి కమిటీలు, టీడీపీ కార్యకర్తలు దోచుకున్నారని ఆరోపించారు. మోసకారి చంద్రబాబుకు జిల్లా ప్రజలు ఓట్లు వేయరన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.  

మరిన్ని వార్తలు