చర్చ జరిగేంత వరకు వదిలిపెట్టం

20 Mar, 2018 02:00 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న మేకపాటి. చిత్రంలో వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, బొత్స

స్పష్టం చేసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు 

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైఎస్సార్‌ సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభ వాయిదా పడిన అనంతరం పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

అవిశ్వాసంపై చర్చ జరగకూడదన్న ధోరణిలో ప్రభుత్వం సభ నడుపుతోందని మండిపడ్డారు. సభలో తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల ఎంపీలు వారి సమస్యలపై నిరసన తెలుపుతుండటంతో ఇదే కారణం చూపుతూ అవిశ్వాసంపై చర్చ జరగనీయకుండా చేయడం సమంజసం కాదన్నారు. అవిశ్వాసంపై చర్చ జరిగే వరకు నోటీసులు ఇస్తూనే ఉంటామని ఎంపీలు స్పష్టం చేశారు. సభలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా ఉగాది, గుడి పడ్వా పండుగల సందర్భంగా స్పీకర్‌ ఇచ్చిన విందును వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు బాయ్‌కాట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు