వేతనాలు లేని కొలువులు

10 Mar, 2019 11:41 IST|Sakshi
జిల్లా సర్వే కార్యాలయం ఒంగోలు

సంక్షోభంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

పనిభారం ఫుల్‌.. వేతనం నిల్‌ 

ఎన్నికల వేళైనా ఫలితం లభించేనా?

సాక్షి, మార్టూరు(ప్రకాశం): భూ సర్వేకు సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వం లైసెన్స్‌డ్‌ సర్వే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చింది. నిరుద్యోగులుగా ఉన్న అర్హులైన వారిని లైసెన్స్‌డ్‌ సర్వేయర్లుగా తీసుకుని మండలాల్లో నియమించడం జరిగింది. వీరికి వేతనాలంటూ ప్రత్యేకంగా ఏమీ లేకుండా సర్వే కోసం అర్జీదారుల చలానా రూపములో చల్లించే 500 రూపాయలను వీరికి చల్లించేలా ప్రకటించి ఆమొత్తాన్ని వీరి ఖాతాల్లో నేరుగా చెల్లిస్తామంటూ వీరి బ్యాంకు ఖాతాల వివరాలను రెండేళ్ల క్రితమే తీసుకున్నట్లు చెప్తున్నారు. కానీ ఇంతవరకు వీరి ఖాతాలో ఒక్క రూపాయి కూడా జమ కాకపోవడం గమనార్హం.

గతంలో సర్వే కోసం అర్జీదారులు చెల్లించాల్సిన చలాన 250 రూపాయలు కాగా వీరికి వేతనానికి బదులు ఇవ్వవలసిన భత్యం కోసం చలానా రుసుమును 500 రూపాయలకు పెంచి రైతులపై భారమైతే వేశారు కానీ వీరికి ఇవ్వకపోవడం విశేషం. సంవత్సరాల తరబడి వీరి పోరాటంలో ఫలితంగా సంబంధిత మంత్రి కె.ఇ. కృష్ణమూర్తి గత సంవత్సరం మే 9వ తేదీ లైసెన్స్‌డు సర్వేయర్లను అసిస్టెంట్‌ సర్వేయర్లుగా నియమిస్తానని ప్రకటించి విధివిధాలను రూపొందించవలసిందిగా అధికారులను ఆదేశించారు.

ఈ క్రమములో అధికారులు మండలానికి ఇద్దరు చొప్పున ప్రకాశం జిల్లాకు 112 మందికి అదనంగా టాస్క్‌ఫోర్సు విభాగానికి ఐదుగురు కలిపి 117 మంది అవసరమని రాష్ట్రవ్యాప్తంగా 1405 మందిని అసిస్టెంట్‌ సర్వేయర్లుగా నియమించాల్సిసిన అవసరం ఉందని నివేదికను రూపొందించారు. కనీసవేతనంగా 21,534 రూపాయలుగా రూపొందించిన నివేదికను చీఫ్‌ సెక్రటరీ అనిల్‌ చంద్ర పునీత్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గతనెల 6వ తేదీ పంపిన యూనియన్‌ నాయకులు చెప్తున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాంట్రాక్టు పద్ధతిన లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించి కనీస వేతనంగా రూ. 18 వేలు ఇస్తున్నట్లు వీరు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న తమకు ఎన్నికల తరణంలోనైనా వేతనాలు ప్రకటిస్తే జీఓ విడుదల చేయాలని వీరు కోరుతున్నారు.

సంవత్సరాల తరబడి వేతనాలు లేవు

సంవత్సరాల తరబడి వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం. పనిభారం చాలా ఎక్కువగా ఉన్నా.. విధులు నిర్వహిస్తున్నాం. ఎన్నికల సమయంలోనైనా సమస్య పరిష్కారమవుతుందని ఎదురు చూస్తున్నాం.
- భాస్కర్‌రెడ్డి, లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు

సమస్యలు త్వరగా పరిష్కరించాలి

రెండు సంవత్సరాలకు పైగా పైసా వేతనం లేదు. చలానా రుసుమును ఖాతాలో జమచేస్తామన్నారు. అదీలేదు. ఇప్పటికైనా సమస్యలు త్వరగా పరిష్కరించాలి.
- వెంకటేష్, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ మార్టూరు

మరిన్ని వార్తలు