అప్పుడే టికెట్ల గొడవ

2 Feb, 2018 15:36 IST|Sakshi
గాంధీ భవన్‌కు తరలివచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు

కాంగ్రెస్‌లో రగడ

ఇబ్రహీంపట్నం స్థానంపై మల్‌రెడ్డి సోదరుల పట్టు

కార్యకర్తలతో కలిసి గాంధీ భవన్‌కు తరలివచ్చిన నేతలు

క్యామ మల్లేష్‌కు సీటు ఇవ్వవద్దని పీసీసీ అధ్యక్షుడికి విజ్ఞప్తి

అభ్యర్థుల ఖరారుపై అధిష్టానానిదే తుది నిర్ణయమన్న ఉత్తమ్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి తారాస్థాయికి చేరింది.నియోజకవర్గస్థాయి రాజకీయాలు చినికి చినికి గాలివానలా మారి గాంధీభవన్‌కు చేరాయి. ఎన్నికలకు ఏడాది ముందే వర్గ కుమ్ము లాటలు జోరందుకున్నాయి. నేతల మధ్య సిగపట్లు ఆ పార్టీని అంతర్గతంగా కుదిపేస్తున్నాయి. తాజాగా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానాన్ని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్‌కు కేటాయించినట్లు జరుగుతున్న ప్రచారంతో రగిలిపోతున్న వైరివర్గం నాయకులు గాంధీభవన్‌ వద్ద పంచాయతీ పెట్టారు. వచ్చే ఎన్నికల్లోనూ క్యామ మల్లేషే బరిలో ఉంటారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించినట్లు వార్తలు రావడంతో.. ఇదే సీటును ఆశిస్తున్న మల్‌రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డిలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మల్‌రెడ్డి సోదరులు, అనుచరులు

కార్యకర్తలను తప్పుదోవ పట్టించేలా పార్టీ అధ్యక్షుడు చేసిన ప్రకటనపై తాడోపేడో తేల్చుకోవాలని అనుచరవర్గంతో గాంధీభవన్‌కు తరలివచ్చారు. ఈ పరిణామంతో ఇబ్రహీంపట్నం కాంగ్రెస్‌ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఇటీవల ప్రకటనపై వాకబు చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి క్యామ మల్లేష్‌ అభ్యర్థిత్వమే కారణమని, మరోసారి అలాంటి పొరపాటు చేయవద్దని సూచించారు. టికెట్టుపై కార్యకర్తల్లో అయోమయం సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు. ఉత్తమ్‌ మాత్రం గెలుపుగుర్రాలకే సీటు కేటాయిస్తామని, టికెట్ల ఖరారు వ్యవహారంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇటీవల ఇతర పార్టీల నేతలు కొందరు పార్టీలో చేరిన సమయంలో అన్యాపదేశంగా క్యామకు టికెట్‌ అన్నానే తప్ప... ఖరారైందని తాను అనలేదని ఉత్తమ్‌ మల్‌రెడ్డి వర్గీయులతో అన్నట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ఉప్పు..నిప్పులా ఉన్న పట్నం రాజకీయాలు తాజా పరిణామాలతో మరింత చిటపటలాడుతున్నాయి.
 
క్యామ వల్లే భువనగిరిలో ఓడిపోయాం: మల్‌రెడ్డి 
ఓడిపోయేవారికి టికెట్లు ఇవ్వడం వల్లే కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఓడిపోయిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. క్యామ మల్లేష్‌కు ఇబ్రహీంపట్నం టికెట్‌ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెంది గాంధీ భవన్‌కు వచ్చారని తెలిపారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారానికి దూరం కావడానికి ఇలాంటి వాళ్లే కారణమన్నారు. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని ఉత్తమ్‌ స్పష్టం చేశారని, మల్లేష్‌ మాత్రం టికెట్‌ వచ్చిన్నట్టు అబద్దపు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. క్యామ మల్లేష్‌కు ఇవ్వడం వల్ల భువనగిరి పార్లమెంటు సీటు ఓడిపోయామని, తమకే గనక పట్నం టికెట్‌ ఇచ్చి ఉంటే.. భువనగిరి  పార్లమెంటు సీటు గెలిచే వాళ్లమని చెప్పారు.
 
అధిష్టానం మాటే శిరోధార్యం : క్యామ మల్లేశ్‌ 
అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా. గెలుపోటములకు అతీతంగా పార్టీ కోసమే పనిచేస్తున్నా. పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. మల్‌రెడ్డి సోదరులు కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదు. అధికారం పోగానే కనుమరుగైన నేతలు ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో కార్యకర్తలకు తెలుసు. ఎన్నడు కూడా ఏఐసీసీ, పీసీసీ నేతలను గౌరవించలేదు. స్థానికంగా వేసిన ఫ్లెక్సీల్లో కూడా నేతలను విస్మరించారు. నాకు టికెట్‌ ఇవ్వనని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎక్కడా ఖండించలేదు. వీరే కార్యకర్తలను తప్పుదోవ పట్టిస్తున్నారు.   

మరిన్ని వార్తలు