అదనపు కట్నం కాటేసింది     

23 Feb, 2018 16:31 IST|Sakshi

ఒంటికి నిప్పంటించుకుని వివాహిత మృతి

అత్తింటికి చేరిన రెండు గంటల్లోనే ఆత్మహత్య

అత్తింటివారే కారణమని మృతురాలి తండ్రి ఫిర్యాదు

ధారూరు : వివాహం జరిగి కనీసం ఏడాది కాకుండానే ఓ మహిళ అదనపు కట్న దాహానికి బలైంది. పుట్టింట్లో పండగ మర్యాదలు చేయించుకుని.. కొత్త బట్టలతో అత్తారింటికి అడుగుపెట్టిన నిమిషా ల్లోనే శవమైంది. భర్త, మరిది, అత్త, మామలు కలిసి తన కూతుర్ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, మేనమామలు ఆరోపించారు. అదనపు కట్నంగా రూ. 2 లక్షలు తీసుకురావాలని వేధిస్తూ వచ్చారని బోరున విలపించారు. ఈ హృదయ విదారక సంఘటన ధారూరు మండలంలోని మున్నూరుసోమారం గ్రామంలో బుధవారం చోటుచేసుకోగా గురువారం వెలుగు చూసింది. ధారూరు తహసీల్దార్‌ గాయత్రి, సీఐ ఉపేందర్‌లు సంఘటన స్థలానికి వెళ్లి శవ పంచానామ నిర్వహించారు. మృతురాలి తల్లిదండ్రులు కిష్టయ్య, యాదమ్మ, మేనమామ నర్సింహులు, సీఐ జె. ఉపేందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన కన్న మల్లేశ్వరి(19)ని మున్నూరుసోమారం గ్రామానికి చెందిన కన్నె రాము గత సంవత్సరం ఏప్రిల్‌ 12న వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కట్నంగా రూ. 4 లక్షలు నగదు, 5 తులాల బంగారం, బడిబాసండ్లు, ఓ బైక్‌ను ఇచ్చారు.

వారి సంసార జీవితం కేవలం 3 నెలలు మాత్రమే సాఫీగా కొనసాగింది. తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. మరో రూ. 2 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని భర్త, మరిది, అత్తమామలు పట్టుబట్టారు. మొత్తం కట్నం డబ్బులు పెళ్లికి ముందే ఇచ్చారనీ.. ఇంటి నుంచి డబ్బులు తెచ్చేది లేదని మల్లేశ్వరి స్పష్టం చేసింది. ఈ విషయం తెలిసిన మల్లే్లశ్వరి తలిదండ్రులు అల్లుడు, కూతుర్ని ఇంటికి పిలిపించి వారికి తోచింది సమర్పించుకుని ఒడి బియ్యం పోసి కొత్త బట్టలతో అదేరోజు అత్తారింటికి సాగనంపారు. అత్తారింటికి చేరిన రెండు గంటలైనా గడవకముందే.. మీ కూతురు కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంని ఆత్మహత్య చేసుకుందని అల్లుడు మల్లేశ్వరి తల్లిదండ్రుకలకు సమాచారం ఇచ్చాడు. గురువారం వారు మున్నూరుసోమారం గ్రామానికి చేరుకుని తమ కూతురు మరణానికి అత్త, మామ, భర్త, మరిది కారణమని, వారిపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలనీ మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపులతో మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకుందని, నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. 
 

మరిన్ని వార్తలు