తప్పిన పెను ప్రమాదం

27 Jan, 2018 19:51 IST|Sakshi
బస్సు ముందుభాగంలో మంటలు రాజుకుంటున్న దృశ్యం

ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు

కొల్చారం(నర్సాపూర్‌): మెదక్‌ వైపు నుంచి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రయాణికులను దించడానికి గేటు వద్ద ఆగింది. బస్సులో ఎక్కేవారు ఎక్కుతున్నారు... దిగేవారు దిగుతున్నారు... ఈ క్రమంలో బస్సు
ఇంజన్‌ ముందు భాగంలో చిన్నపాటి మంటలు చెలరేగాయి. గమనించిన చుట్టుపక్కలవారు డ్రైవర్‌ను, బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేశారు. మంటలు మరింతగా చెలరేగడంతో ప్రయాణికులు ఎలాగోలా
బస్సులో నుంచి దిగి ప్రాణాలను కాపాడుకునకున్న సంఘటన కొల్చారంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... బాన్సువాడ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు బోదన్‌ నుంచి హైదరాబాద్‌కు
వెళ్తోంది. కొల్చారంలోని బస్టాండ్‌ సమీపంలోకి వచ్చి ప్రయాణికులను దించేందుకు డ్రైవర్‌ బస్సును నిలిపాడు.

ఇంజన్‌ ముందు భాగంలో చిన్నపాటి మంటలు చెలరేగడంతో అటువైపుగా హోటళ్లలో వారు అదిగమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్, ప్రయాణికులు లగేజీని బస్సులోనే వదిలి ఉరుకులు, పరుగులు పెట్టారు. మంటలు పెద్దగా మారి బస్సు ఇంజన్‌ భాగంలో పూర్తిగా కాలిపోయింది. బస్సులో దట్టమైన నల్లటిపొగ కమ్ముకోవడం గమనించిన చుట్టుపక్కల యువకులు, హోటళ్లకు చెందిన వారు మంటలను ఆర్పేందుకు ఇసుక చల్లారు. నీళ్లను కూడా ఉపయోగించడంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు ముందు భాగంమాత్రం పూర్తిగా దెబ్బతింది. బస్సు నడుస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే ప్రాణనష్టం వాటిల్లే అవకాశాలు ఉండేవని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి బస్సు మరింత కాలిపోకుండా సహాయక చర్యలు చేపట్టారు. 

మరిన్ని వార్తలు