కరువుదీరా గోదావరి నీళ్లు

20 Jan, 2018 02:00 IST|Sakshi
మోటారు సైకిల్‌పై వెళ్తూ కాల్వల నిర్మాణం పనులు పరిశీలిస్తున్న మంత్రి హరీశ్‌

     కాళేశ్వరంతో కల సాకారం: హరీశ్‌రావు 

     జూలై నాటికి కొండపోచమ్మసాగర్‌ వరకు.. 

     అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులు నింపుతామని వెల్లడి  

సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తెలంగాణకు కరువుదీరా గోదావరి నీళ్లు వస్తాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే తెలంగాణ ప్రజల కల సాకారం అయినట్టేనని చెప్పారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ నుంచి దిగువ ప్రాంతానికి నీళ్లను మళ్లించే కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి కాల్వల నిర్మాణాల పరిస్థితి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ గోదావరి నది నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉన్న మల్లన్నసాగర్‌ వరకు నీటిని తరలించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చెప్పారు. 90 కిలోమీటర్లకు పైగా సొరంగ మార్గం ద్వారా టన్నెల్‌ పనులు ముమ్మరంగా చేస్తు న్నారని, పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయన్నారు. దీనికి తోడు రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల నిర్మాణం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇందుకు అనుగుణంగా కాల్వల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయితే వచ్చే జూలై  నాటికి గోదావరి నీళ్లు రిజర్వాయర్‌ వరకు అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులను నింపుతామని చెప్పారు.   

క్రీడలకు పెద్దపీట 
క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ మండలంలో క్రీడా మైదానాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే తెలంగాణ నుంచి పలువురు క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి ఉత్తమ బహుమతులు పొందారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 29 రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులను కలసి అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు