ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోన్న బీర్‌ఖల్సా ప్రదర్శన

5 Jun, 2019 18:36 IST|Sakshi

వాషింగ్టన్‌ : కొన్ని టీవీ షోల్లో కళ్లకు గంతలు కట్టుకుని టార్గెట్‌ని కొట్టడం.. మనిషి తల మీద ఓ పండు పెట్టి దాన్ని కొట్టడం వంటివి చూస్తూనే ఉంటాం. ఇప్పుడు వీటన్నింటిని తలదన్నే వీడియో ఒకటి ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. దీన్ని చూసిన వాళ్లు భయంతో కూడిన ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఇండియాకు చెందిన బీర్‌ఖల్సా గ్రూప్‌ చేసిన ఈ ప్రదర్శనకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. అమెరికాస్‌ గాట్‌ టాలెంట్‌ అనే షోలో బీర్‌ఖల్సా గ్రూప్‌ ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ గ్రూప్‌లో జగ్దీప్‌ సింగ్‌, కన్వల్జిత్‌ సింగ్‌, కరంజిత్‌ సింగ్‌ ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. వీరిలో జగ్దీప్‌ సింగ్‌ ఎత్తు 7 అడుగుల 6 అంగుళాలు. ప్రస్తుతం ఇతడు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలీస్‌ ఉద్యోగిగా రికార్డు సృష్టించాడు.

ఇక ఈ గ్రూప్‌ చేసిన విన్యాసాలు వర్ణించడానికి మాటలు రావు. ప్రదర్శనలో భాగంగా జగ్దీప్‌ సింగ్‌ను పడుకోబెట్టి అతని చుట్టూ కొబ్బరి కాయలు.. తల దగ్గర పుచ్చకాయలు పెట్టారు. మరో వ్యక్తి కళ్ల మీద ఉప్పు పోసుకుని.. గంతలు కట్టుకోని.. ఓ సుత్తి తీసుకుని ఏ మాత్రం తడబడకుండా.. మనిషికి తగలకుండా కొబ్బరి కాయలు, పుచ్చ కాయలు పగలకొట్టాడు. వీరు ప్రదర్శన ఇస్తున్నంత సేపు ప్రేక్షకులతో పాటు న్యాయ నిర్ణేతలు కూడా భయపడుతూ.. ఆశ్చర్యపోతూ.. అంతలోనే తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ప్రదర్శనను ఆసాంతం తిలకించారు. ప్రదర్శన పూర్తయ్యాక తేరుకోవడానికి అందరికి కాస్తా సమయం పట్టింది. ఆ తర్వాత ప్రేక్షకులతో పాటు జడ్జీలు కూడా లేచి నిల్చుని చప్పట్లతో అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

మరిన్ని వార్తలు