వైరల్‌: తిరగబడిన దున్నపోతు.!

17 Apr, 2019 15:57 IST|Sakshi

కొందరు జీవితంలో చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లుతారు. ఇక ఆ సమస్యకు మరింత కష్టం తోడైతే.. ఎదవ జీవితం ఎందుకురా! అని బలవన్మరణానికి పాల్పడుతారు. కానీ ఓ దున్నపోతు తన ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన పోరాటం.. చూపిన ధైర్యం ఇలాంటి వారికి ఓ గుణపాఠంగా నిలుస్తోంది. ఆ దున్న పోరాటంలో దెబ్బ మీద దెబ్బ పడినా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా చూపిన తెగువ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సమయస్పూర్తితో వ్యవహరించి తన మీదకు వచ్చిన సింహాలనే పరుగెత్తించింది. ప్రస్తుతం ఆ దున్న పోరాటానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియోను దక్షిణాఫ్రికాలోని క్రుగర్‌ నేషనల్‌ పార్క్‌లో ఓ టూర్‌గైడ్‌ తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఆ వీడియో ఏంటంటే..  ఓ సింహం. దున్నపోతును వెంటాడింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఆ దున్న పరుగెత్తుతూ.. నీటికుంటలోకి దూకింది. హమ్మయ్యా! ప్రాణాలు గట్టెక్కినట్టే అనుకొని ప్రశాంతంగా ఈదసాగింది. కానీ గాశారం బాగలేకుంటే అరటిపండు తిన్నా.. పళ్లు ఇరుగుతాయన్నట్లు.. ఆ దున్నకు మరో జఠిల సమస్య ఎదురైంది. సింహం నుంచి గట్టెక్కాంరా! నాయనా! అనుకుంటే మొసళ్లు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇదెక్కడి గోలరో నాయనా! అనుకుంటు ఆ దున్న వాటితో పోరాటం చేసింది. వాటిపైకి తిరగబడింది.

‘ఈ నీళ్ల కుంట కన్నా ఆ భూమి మీదికి వెళ్లడమే నయంరా! బాబూ..’ అనుకుంటూ ఎలాగోలా దున్న ప్రాణాలతో బతుకుజీవుడా అంటూ అందులో నుంచి బయటపడింది. కానీ అక్కడ సీన్‌ రివర్స్‌.. ఒక్క సింహం.. కాస్త రెండు, మూడు, నాలుగు సింహాలు ఇలా.. పెద్ద గుంపే అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు.. కొద్ది సేపు ఆగి.. ‘ఇక లాభం లేదు.. తిరగబడాల్సిందే’ అనుకుంది ఆ సింహాలపై ఎదురు దాడికి దిగింది. వాటిని కొద్ది దూరం పరుగెత్తించింది. ఈ గ్యాప్‌లో పరుగు లక్కించుకొని.. ఐకమత్యమే మహాబలం అన్నట్లు.. తన మిత్రులను గుంపు గుంపులుగా తీసుకొచ్చింది. సింహాలు వర్సెస్‌ దున్నలు అన్నట్లు సీన్‌ మారింది. దున్నల గుంపులను చూసిన సింహాలు భయంతో పరుగు లంకించుకున్నాయి..! సమయస్పూర్తితో పోరాటం చేసిన ఆ దున్న తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ వీడియో చూడటానికి ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు