‘నిజమైన దేశభక్తులు ఇలా చేయరు’

25 Feb, 2019 20:35 IST|Sakshi

టీమిండియా- ఆసీస్‌ జట్ల మధ్య ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌ ప్రారంభానికి ముందు అభిమానులు ప్రవర్తించిన తీరుపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజమైన దేశభక్తులెవరూ ఈవిధంగా చేయరంటూ నెటిజన్లు ప్రేక్షకులపై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే... భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య విశాఖపట్నంలో తొలి టీ20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల జాతీయ గీతాలు ఆలపించిన తర్వాత... పుల్వామా ఘటనకు సంతాపంగా ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అయితే ఆ సమయంలో భారత్‌ మాతాకీ జై అంటూ ప్రేక్షకులు గట్టిగా నినాదాలు చేయడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అసహనం వ్యక్తం చేశాడు. మౌనంగా ఉండాలంటూ ప్రేక్షకులకు సైగలతో సూచించాడు.

కాగా ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు...‘ పుల్వామా ఉ‍‍గ్రదాడిలో అమరులైన జవాన్లకు మౌనం పాటించే సమయంలో కొంతమంది ఎలా ప్రవర్తించాలో మర్చిపోయారు. బుద్ధి లేకుండా అరుస్తూ, చీర్‌ చేస్తారా... కొంత మంది ఫోన్లు చూసుకుంటారు. నిజమైన దేశ భక్తులు ఇలా చేయరు. దురభిమానానికి, ఉన్మాదానికి ఇది మరొక ఉదాహరణ. మళ్లీ వాళ్లే దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతారు’ అంటూ ఘాటుగా విమర్శించారు. ఇక ఆదివారం విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు