CWC 2023: రోహిత్‌కు ఆఖరి వరల్డ్‌కప్‌.. ఇదే టోర్నీలో విరాట్‌ 50వ వన్డే సెంచరీ కొడతాడు..!

14 Nov, 2023 13:41 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై అతని వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ లాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ వయసుపై, ప్రస్తుత వరల్డ్‌కప్‌లో భారత విజయావకాశాలపై ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. రోహిత్‌కు ఇదే చివరి వరల్డ్‌కప్ కావచ్చు. ప్రస్తుతం అతని వయసు 36 సంవత్సరాలు. తదుపరి వరల్డ్‌కప్‌ సమయానికి అతనికి 40 ఏళ్లు వస్తాయి. భారత క్రికెటర్లు ఆ వయసులో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడతారని నేననుకోను.

రోహిత్‌కు కూడా అది తెలుసు. కాబట్టి అతను ఈసారి ఎలాగైనా దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని కోరుకుంటున్నాడు. ఇదే సందర్భంగా దినేశ్‌ లాడ్‌ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోహ్లి ఆడుతున్న తీరు చూస్తుంటే, ఇదే టోర్నీలో అతను తన 50వ వన్డే సెంచరీ చేస్తాడని అనిపిస్తుందని అన్నాడు.

కాగా, ప్రపంచకప్‌ లీగ్‌ దశలో తొమ్మిది వరుస విజయాలతో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. ముంబై వేదికగా బుధవారం (నవంబర్‌ 15) జరుగబోయే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ టోర్నీలో హిట్‌మ్యాన్‌, విరాట​్‌ కోహ్లి సహా భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ అంతా భీకర ఫామ్‌లో ఉంది. టాప్‌-5లో నలుగురు బ్యాటర్లు ఇప్పటికే సెంచరీలు కూడా చేశారు.

కోహ్లి 2 సెంచరీలు చేయగా.. రోహిత్‌, శ్రేయస్‌, రాహుల్‌ తలో సెంచరీ బాదారు. శుభ్‌మన్‌ గిల్‌ సైతం 3 అర్ధసెంచరీలు చేసి పర్వాలేదనిపిస్తున్నాడు. ప్రస్తుత జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే రాణించాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ మనవాళ్లు చెలరేగిపోతున్నారు. మన పేస్‌ త్రయం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. బుమ్రా (9 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు), షమీ (5 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు), సిరాజ్‌ (12 వికెట్లు) కలిపి 45 వికెట్లు నేలకూల్చారు.

స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌లు 30 వికెట్లు పడగొట్టారు. ఫీల్డింగ్‌లోనూ మనవాళ్లు మెరుపులు మెరిపిస్తున్నారు. కోహ్లి, రోహిత్‌ సైతం గత మ్యాచ్‌లో వికెట్లు తీసి పార్ట్‌టైమ్‌ బౌలింగ్‌కు సై అంటున్నారు. ఇన్ని అనుకూలతల నేపథ్యంలో భారత్‌ ఈసారి ప్రపంచకప్‌ గెలవడం ఖాయమని అంతా అంటున్నారు. ఈ విషయం తేలాలంటే నవంబర్‌ 19 రాత్రి వరకు వేచి చూడాల్సిందే.


   

మరిన్ని వార్తలు