'ఇంకా ముగిసిపోలేదు'

8 Feb, 2018 15:40 IST|Sakshi
ఏబీ డివిలియర్స్‌-జేపీ డుమినీ(ఫైల్‌ఫొటో)

కేప్‌టౌన్‌: తమ జట్టుపై టీమిండియా వరుస విజయాలు సాధించి తిరుగులేని ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నప్పటికీ మిగతా మ్యాచ్‌ల్లో సత్తాచాటి సిరీస్‌ను సమం చేస్తామని దక్షిణాఫ్రికా మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాడు జేపీ డుమినీ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ సగం వన్డే సిరీస్‌ మాత్రమే అయిన విషయాన్ని డుమినీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. తదుపరి వన్డేల​కు ఏబీ డివిలియర్స్‌ జట్టుతో కలవడం కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.

'ఇంకా సిరీస్‌ ముగిసిపోలేదనే విషయం మాకు తెలుసు. సిరీస్‌ను కాపాడుకోవడానికి మాకు ఇప్పటికీ ఛాన్స్‌ ఉంది. తదుపరి మూడు వన్డేలకు డివిలియర్స్‌ అందుబాటులోకి రావడం శుభపరిణామం. ఏబీ రాక మాలో అమితమైన ఆత్మవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. కచ్చితంగా వరుస విజయాలు సాధించి సిరీస్‌ను సమం చేస్తాం' అని డుమినీ తెలిపాడు. అయితే దక్షిణాఫ్రికా పిచ్‌లపై భారత్‌ ఆడుతున్న తీరును డుమినీ కొనియాడాడు. ప్రధానంగా తమ పిచ్‌లపై ఏ రకంగా బౌలింగ్‌ చేయాలో టీమిండియా బౌలర్లు బాగా వంటబట్టించుకున్నారన్నాడు. తమ జట్టును భారీగా పరుగులు సాధించకుండా భారత బౌలర్ల రాణించడమే వారి వరుస విజయాలకు ప్రధాన కారణమన్నాడు. మరీ ముఖ్యంగా భారత స్పిన్నర్లు వేసే గుగ్లీలను టచ్‌ చేయడానికి తమ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందన్నాడు. ఈ క్రమంలోనే భారత స్పిన్నర్లకు వికెట్లను సమర్పించుకుని వరుస మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన విషయాన్ని డుమినీ అంగీకరించాడు.అయితే ఏబీ పునరాగమనం జట్టుకు కలిసొచ్చే అంశంగా పేర్కొన్నాడు..

మరిన్ని వార్తలు