ఆ క్రికెటర్‌ను ఎప్పుడూ తీయకండి: అక్తర్‌

15 Feb, 2020 14:57 IST|Sakshi

అతనొక  స్ట్రీట్‌ స్మార్ట్‌ క్రికెటర్‌

కరాచీ: ఇటీవల టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అంటూ కొనియాడిన పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షో​యబ్‌ అక్తర్‌.. తాజాగా యజ్వేంద్ర చహల్‌ను స్ట్రీట్‌ స్మార్ట్‌ అంటూ ప్రశంసించాడు. ప్రస్తుత భారత క్రికెట్‌ జట్టులో చహల్‌ ఎంతో నైపుణ్యమున్న స్పిన్నర్‌ అని కొనియాడాడు. చహల్‌ పూర్తిస్థాయి లెగ్‌ స్పిన్నర్‌ అని, జట్టులో ఉన్నాడంటే అతని పాత్రకు సంపూర్ణ న్యాయం చేస్తాడన్నాడు. ‘ చహల్‌ ఒక కచ్చితమైన లెగ్‌ స్పిన్నర్‌ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతనొక వైవిధ్యమైన బౌలర్‌. అతను సంధించే బంతులకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లు తడబడుతూ వికెట్లు సమర్పించుకుంటారు. బ్యాట్స్‌మెన్‌ను ఎక్కువగా అయోమయానికి గురి చేస్తూ బంతులు వేస్తాడు. అతని ట్రిక్స్‌-టెక్నిక్స్‌ అమోఘం.  

జట్టు కష్టాల్లో పడ్డటప్పుడు మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్న స్ట్రీట్‌ స్మార్ట్‌ క్రికెటర్‌ చహల్‌. సాధ్యమైనంతవరకూ చహల్‌ను తుది జట్టులో కొనసాగించడానికి యత్నించండి. ఎప్పుడూ రిజర్వ్‌ బెంచ్‌లో కూర్చొబెట్టొద్దు. రవీంద్ర జడేజా అప్పుడప్పుడు వికెట్లు తీస్తూ  ఉంటే చహల్‌ మాత్రం రెగ్యులర్‌ విరామాల్లో వికెట్లను సాధిస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తాడు.  కుల్దీప్‌ యాదవ్‌ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. కుల్దీప్‌ కంటే చహల్‌ ఎంతో నయం.  నా ప్రకారం చూస్తే కుల్దీప్‌లో పెద్దగా జోష్‌ కనిపించదు. అతను ఫ్రీగా బౌలింగ్‌ చేయలేడు. అలా కాకపోతే గేమ్‌లో స్థానం చాలా కష్టం. కుల్దీప్‌ రాణించకపోవడమే భారత్‌ను కలవరపరిచే అంశం. చహల్‌లో విజయాల్ని ఒంటి చేత్తో సాధించే సత్తా ఉంది. మిడిల్‌ ఓవర్లలో ఎవరూ కూడా వికెట్లు తీయలేరు. ఇక్కడ ఎంత గొప్ప బౌలర్‌ అయినా మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయడం కష్టం​’ అని అక్తర్‌ పేర్కొన్నాడు. 

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ చహల్‌ ఉన్నాడు. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో చహల్‌ను తప్పించి కుల్దీప్‌కు అవకాశం ఇచ్చారు. ఆ మ్యాచ్‌లో కుల్దీప్‌ విఫలయ్యాడు. భారత జట్టు 347 పరుగుల్ని కాపాడుకోలేకపోయింది. ఇక్కడ కుల్దీప్‌ యాదవ్‌ 10 ఓవర్లలో 84 పరుగులిచ్చి చెత్త గణాంకాలు నమోదు చేయడంతో భారత్‌ గెలవాల్సిన మ్యాచ్‌ చేజారింది. దాంతో కుల్దీప్‌ను తప్పించి మిగిలిన రెండు వన్డేల్లో చహల్‌కు అవకాశం ఇచ్చాడు. రెండు వన్డేల్లోనూ ఆడిన చహల్‌ తలో మూడు వికెట్లు సాధించి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే భారత్‌ చేసిన పొరపాటును అక్తర్‌ వేలెత్తిచూపాడు. 

మరిన్ని వార్తలు