పాక్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం: టర్కీ | Sakshi
Sakshi News home page

పాక్‌లో టర్కీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై భారత్‌ అభ్యంతరం

Published Sat, Feb 15 2020 2:58 PM

India Counter To Turkey President Comments On JK in Pakistan - Sakshi

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: జమ్ము కశ్మీర్‌ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలుస్తామన్న టర్కీ అధ్యక్షుడు రెసీప్‌ తయీప్‌ ఎర్డోగన్‌ వ్యాఖ్యలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం సహించబోమని మరోసారి స్పష్టం చేసింది. శుక్రవారం నాటి పాక్‌ పర్యటనలో భాగంగా ఎర్డోగన్‌.. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశంలో తాము ఎల్లప్పుడూ న్యాయం వైపే ఉంటామని.. అందుకే పాకిస్తాన్‌కు అండగా నిలుస్తున్నామన్నారు. 

ఈ మేరకు పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో భేటీ అయిన అనంతరం ఎర్డోగన్‌ మాట్లాడుతూ... ‘‘దశాబ్దకాలంగా మా కశ్మీరీ సోదరసోదరీమణులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకపక్ష నిర్ణయాల కారణంగా వారికి ఈ దుస్థితి వచ్చింది. కశ్మీర్‌ గురించి ఈరోజు పాకిస్తాన్‌ ఎంతగా వేదన చెందుతుందో.. టర్కీ కూడా అంతే బాధపడుతోంది. ఈ విషయంలో అన్ని వర్గాలు న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మేం న్యాయం వైపునే నిలబడతాం. కశ్మీర్‌ అంశంపై శాంతియుత చర్చలు జరిగితేనే చక్కని పరిష్కారం దొరుకుతుంది. ఈ విషయంలో పాకిస్తాన్‌కు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఎర్డోగన్‌ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని టర్కీ నాయకత్వానికి స్పష్టం చేస్తున్నాం. వాస్తవాలను అర్థం చేసుకుంటే బాగుంటుంది. పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం కారణంగా భారత్‌, కశ్మీర్‌ ప్రాంతానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మీరు తెలుసుకోవాలి. జమ్మూ కశ్మీర్‌ విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించం’’ అని స్పష్టం చేశారు. కాగా గతేడాది ఆగస్టులో భారత ప్రభుత్వం ఆర్టికల్‌ 370 రద్దు చేసిన నాటి నుంచి.. అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాకిస్తాన్‌ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐరాస వంటి పలు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్‌ తమ అంతర్గత విషయమని భారత్‌ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement