హెచ్‌సీఏపై అంబటి రాయుడు తీవ్ర ఆరోపణలు

23 Nov, 2019 15:20 IST|Sakshi

హైదరాబాద్‌:  అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్‌ తీసుకుని హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దాంతో తాను వచ్చే రంజీ సీజన్‌లో హైదరాబాద్‌ జట్టుకు దూరంగా ఉంటానంటూ ప్రకటించాడు. దీనిలో భాగంగా హెచ్‌సీఏలో అవినీతిని నిరోధించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్‌కు) ట్వీట్‌ చేశారు.

‘హలో కేటీఆర్‌ సార్‌. హెచ్‌సీఏలో తీవ్రంగా ప్రబలిన అవినీతిపై దృష్టి పెట్టండి. అసలు హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్‌సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్‌సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు’ అని అంబటి రాయుడు ట్వీట్‌ చేశాడు.

ఇటీవల జరిగిన విజయ్‌ హజారే, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీల్లో భాగంగా హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అంబటి రాయుడు.. జట్టులో రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాలతో జట్టులో మంచి వాతావరణం లేదన్నాడు. దాంతోనే తాను హైదరాబాద్‌ జట్టుకు దూరంగా ఉండదలుచుకున్నానని పేర్కొన్నాడు. ‘ నిజాయితీగా చెప్పాలంటే నేను రంజీ ట్రోఫీ ఆడదామనుకున్నా. కానీ ఒక కెప్టెన్‌గా నేను ఊహించినట్లు జరగడం లేదు. రాజకీయాలు పెరిగిపోయాయి. మంచి క్రికెట్‌ ఆడే వాతావరణం ఇప్పుడు హైదరాబాద్‌ జట్టులో లేదు. నేను హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టులో సౌకర్యవంతంగా లేను’ అని ఒక ఇంటర్యూలో పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు