‘బౌండరీ రూల్‌’ మారుతుందా?

29 Jul, 2019 11:07 IST|Sakshi

దుబాయ్‌:  వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించడంతో ఐసీసీపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్‌ ఓవర్‌లో పరుగులు కూడా సమం అయిన పక్షంలో బౌండరీల లెక్కింపుతో గెలుపును నిర్ణయించడం సరికాదని పలువురు క్రికెట్‌ విశ్లేషకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై ఎట్టకేలకు ఐసీసీ దిగివచ్చింది. ఈ రూల్‌ ఎంతవరకూ సమంజసం అనే దానిపై సమీక్ష సమావేశం నిర్వహించనుంది.దీనిలో భాగంగా బౌండరీల లెక్కించే నిబంధనపై సమీక్షించేందుకు భారత మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిర్వహించే తదుపరి సమావేశంలో ఈ నిబంధనపై చర్చించనున్నారు.

సమావేశం వచ్చే ఏడాది త్రైమాసికంలో జరగుతుందని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జియోఫ్‌ అలార్డెస్‌ తెలిపారు. ‘మ్యాచ్‌ టైగా ముగిస్తే సూపర్‌ ఓవర్‌తో విజేతను నిర్ణయించే పద్ధతిని 2009 నుంచి పాటిస్తున్నారు. సూపర్ ఓవర్‌లో కూడా పరుగులు సమం అయితే బౌండరీల లెక్కతో గెలుపును ప్రకటిస్తారు. ప్రపంచకప్ ఫైనల్లోనూ అదే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20లీగ్‌ల్లోనూ దాదాపుగా ఇదే ప్రక్రియను నిర్వహిస్తున్నారు.  అంతర్జాతీ క్రికెట్‌లో ఒకే తరహాలో సూపర్ ఓవర్‌ నిబంధనలు ఉండాలి. దీనిపై ప్రత్యామ్నాయాలు ఉంటే అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ పరిశీలిస్తుంది’ అని జియోఫ్‌ పేర్కొన్నారు.  మరి బౌండరీ రూల్‌ మారుతుందో.. లేదో చూడాలి.

మరిన్ని వార్తలు