నా రికార్డు భేష్‌.. ఇంకా చెప్పడం ఎందుకు?

27 Dec, 2019 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ: వన్డే ఫార్మాట్‌లో పునరాగమనంపై టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే ఆశతో ఎదురుచూస్తున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్న రహానే.. వన్డే మ్యాచ్‌ను ఆడి దాదాపు రెండేళ్లు అయ్యింది. అయితే వన్డే ఫార్మాట్‌లో తన రీఎంట్రీ అంత కష్టం ఏమీ కాదని అంటున్నాడు. ఇదొక సరదా గేమ్‌ అని, ఇక్కడ ఏమైనా జరగొచ్చన్నాడు. 2018 ఫిబ్రవరిలో భారత్‌ తరఫున చివరి సారి వన్డే సిరీస్‌లో రహానే కన్పించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టులో సభ్యుడైన రహానే ఆ వన్డే సిరీస్‌లో 140 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 79 నాటౌట్‌.

అటు తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకోవడంలో రహానే విఫలయ్యాడు. వరల్డ్‌కప్‌ జట్టుతో పాటు ఇటీవల జరిగిన సిరీస్‌ల్లో సైతం రహానేకు సెలక్టర్లు అవకాశం కల్పించలేదు. అయితే వన్డే ఫార్మాట్‌లో తన రీఎంట్రీ కచ్చితంగా ఉంటుందని అంటున్నాడు రహానే.  ‘ క్రికెట్‌ అనేది ఫన్నీ గేమ్‌. ఇక్కడ ఏదైనా జరగొచ్చు. నేను వన్డేల్లో పునరాగమనంపై ఆశలు వదులుకోలేదు. నా రెండేళ్ల రికార్డు బాగుందనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే నా రికార్డు బాగుంది కాబట్టి చెప్పుకోవాల్సిన పనిలేదు. మనం సక్సెస్‌ బాటలో ఉన్నప్పుడు జట్టుకు దూరంగా కావడం అనేక ప‍్రశ్నలకు తెరలేపుతోంది. మనం క్రికెట్‌ను ఆపేసిన సమయం వచ్చేసిందా అనే అనుమానం కూడా కల్గుతుంది. నేను ఈ ఏడాది జరిగిన వరల్డ్‌కప్‌కు ఎంపిక కానప్పుడు అదే నాకు అలానే అనిపించింది. కానీ ఆ తర్వాత సరికాదనిపించింది’ అని రహానే చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు