ఆర్చర్‌.. నీ పాస్‌పోర్ట్‌ చూపించు!

5 Sep, 2019 12:18 IST|Sakshi

మాంచెస్టర్‌: ఆసీస్-ఇంగ్లండ్‌ జట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే సిరీస్‌ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా యాషెస్‌ సిరీస్‌.  ఈ సిరీస్‌ను ఆటగాళ్లు ఎంత సీరియస్‌గా తీసుకుంటారో, అభిమానులు కూడా అంతే జోష్‌ కనబరుస్తారు. కొన్ని సందర్భాల్లో అభిమానుల అనుచిత ప‍్రవర్తన కూడా హద్దులు దాటుతూ ఉంటుంది. ఇప‍్పటికే ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ను చీటర్‌ అంటూ అభిమానులు ఎగతాళి చేయగా, తాజాగా ఇంగ్లండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ కూడా చేదు అనుభవం ఎదురైంది. బుధవారం ప్రారంభమైన యాషెస్‌ సిరీస్‌ నాల్గో టెస్టులో భాగంగా జోఫ్రా ఆర్చర్‌ బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఆసీస్‌ అభిమానులు తిట్ల దండకం అందుకున్నారు.

ప్రధానంగా ఆర్చర్‌ బార్బోడాస్‌ నుంచి వచ్చి ఇంగ్లండ్‌కు ఆడటాన్ని ప్రస్తావించారు. ‘ ఈ బార్బోడాస్‌ హెరిటేజ్‌ టెస్టు చాలా చప్పగా ఉంది’ అంటూ ఇద్దరు ఆసీస్‌ అభిమానులు ఎద్దేవా చేశారు. ‘అసలు నీకు పాస్‌పోర్ట్‌ ఉందా. ఒకసారి నీ పాస్‌పోర్ట్‌ చూపించు’ అంటూ ఎగతాళిగా మాట్లాడారు.  ఇంగ్లండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సమీపంగా కూర్చొని ఉన్న సదరు ఆసీస్‌ అభిమానులు ఇలా అనుచితంగా ప‍్రవర్తించడాన్ని కొంతమంది అథారిటీ దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగుచూసింది.  ఆపై వారిని బయటకు పంపించేశారు యాషెస్‌ నిర్వాహకులు.

నాల్గో టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ మూడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.  ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌(0), మార్కస్‌ హారిస్‌(13)లు నిరాశపరిచినప్పటికీ లబుషేన్‌(67) బాధ్యతాయుతంగా ఆడాడు. యాషెస్‌లో మరో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అటు తర్వాత స్టీవ్‌ స్మిత్‌(60 బ్యాటింగ్‌) సైతం అర్థ శతకం సాధించడంతో ఆసీస్‌ గాడిలో పడింది. స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌(18 బ్యాటింగ్‌)లు క్రీజ్‌లో ఉన్నారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా