నేనైతే కోహ్లిని అలా ఔట్‌ చేయను: బెన్‌ స్టోక్స్‌

26 Mar, 2019 16:06 IST|Sakshi

జైపూర్‌ : ‘మన్కడింగ్‌ ఔట్‌’ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై ఇంగ్లండ్‌ స్టార్‌ బౌరల్‌, రాజస్తాన్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అంతకు ముందు అశ్విన్‌ తీరుపై  రాజస్తాన్‌ రాయల్స్‌ మెంటర్‌, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ ట్విటర్‌ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వరుస ట్వీట్లతో అ‍శ్విన్‌పై విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అశ్విన్‌ తనను నిరాశపరిచాడని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ క్రీడాస్పూర్తితో ఆడుతామని ఐపీఎల్‌ వాల్‌పై సంతకం చేశారని గుర్తు చేశాడు.

అసలు ఆ సమయంలో అశ్విన్‌కు ఆ బంతి వేసే ఆలోచన లేదని.. అందుకే బట్లర్‌ను రనౌట్‌ చేశాడని.. దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణించాల్సి ఉండేదని వార్న్‌ తెలిపాడు. ఐపీఎల్‌లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసిక స్థితిని చెడగొడుతుందని, క్రికెట్‌లో అన్నిటి కంటే క్రీడాస్ఫూర్తే ముఖ్యమని పేర్కొన్నాడు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని షేన్ వార్న్ సూచించాడు.  బెన్‌ స్టోక్స్‌ కూడా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని అశ్విన్‌లానే ఔట్‌ చేస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించాడు.  అశ్విన్‌ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని.. ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు షేన్ వార్న్ మరో ట్వీట్‌లో ప్రస్తావించాడు.

అయితే షేన్‌వార్న్‌ బెన్‌ స్టోక్స్‌ పేరు ప్రస్తావించడంతో ఈ ఇంగ్లీష్‌ పేసర్‌ స్పందించాడు. ‘ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతూ.. విరాట్‌ కోహ్లి బ్యాటింగ్‌ చేస్తూ.. నేను బౌలింగ్‌ చేస్తుండగా.. మన్కడింగ్‌ విధానంలో ఔట్‌ చేసే అవకాశం వచ్చినా నేను చేయను. ఎప్పుడు ఎక్కడా అలా చేయను. నా పేరు ప్రస్తావించారు కాబట్టే ఈ వివరణ ఇస్తున్నాను’ అని ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌ అభిమానులు సైతం అశ్విన్‌ తీరుపై మండిపడుతున్నారు. నిజానికి అశ్విన్‌ అలా చేయకుంటే కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌ గెలిచి ఉండేది కాదు. అప్పటికే బట్లర్‌ 43 బంతుల్లో 69 పరుగులు చేసి బీకరంగా ఆడుతున్నాడు. బట్లర్‌ ఔట్‌తో రాజస్తాన్‌ 14 పరుగులతో సొంతగడ్డపై పరాజయం పాలైంది.

చదవండి: మన్కడింగ్‌ ఔట్‌ అంటే ఏంటో తెలుసా?

అశ్విన్‌ ఏందీ తొండాట..!

మరిన్ని వార్తలు