నాకు బాయ్‌కాట్‌ కోపం తెప్పించారు: సైఫ్‌ అలీఖాన్‌

20 Jul, 2020 17:06 IST|Sakshi

ముంబై:  బాలీవుడ్‌  హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ తండ్రి మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడి.  మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ అంటే భారత క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన క్రికెటర్‌. ఆయనకు 'టైగర్ పటౌడి' అనే ముద్దు పేరు కూడా ఉంది.  అయితే టైగర్ పటౌడి తన కెరీర్‌లో ఎక్కువ భాగం ఒక కంటి చూపుతోనే క్రికెట్‌ ఆడారు. పటౌడి 1961లో ఇంగ్లండ్‌లో కారు ప్రమాదానికి గురికావడంతో ఆయన కుడి కన్ను దెబ్బతింది. అయినా అలాగే క్రికెట్‌ ఆడి పరుగుల వరద పారించారు. ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక ముద్ర వేశారు. అయితే మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ ఒక కన్ను పని చేస్తుందనే  విషయం చాలా మందికి తెలియదు. తన తండ్రి టైగర్ పటౌడి కంటి సమస్య గురించి ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ జఫ్రీ బాయ్‌కాట్‌ చేసిన వ్యాఖ్యల గురించి తాజాగా మాట్లాడిన సైఫ్‌ అలీఖాన్‌.. ఆ మాటలు తనకు, తన తండ్రికి కోపం తెప్పించాయని తెలిపారు. (వరల్డ్‌కప్‌లో ఇది స్పెషల్‌ ఇన్నింగ్స్‌!)

తాజాగా స్పోర్ట్స్‌ కీడాతో సైఫ్‌ ముచ్చటిస్తూ.. ‘ ఒకసారి బాయ్‌కాట్‌ నాతో మాట్లాడుతూ.. మీ నాన్న గారి గురించి విన్నాను. కానీ ఒకే కంటితో టెస్టు క్రికెట్‌ ఆడటమనేది అసాధ్యం’ అని అన్నాడు. దాంతో నేను మా నాన్న అబద్ధం చెబుతున్నారని, చీటింగ్‌ చేశారని అనుకుంటున్నారా? అని తిరిగి అడిగితే, అవును.. దాదాపు అలానే అనుకుంటున్నాను అని అన్నారు. దాంతో నాకు విపరీతమైన కోపం వచ్చేసింది’ అని సైఫ్‌ తెలిపారు. . అదే విషయం మా నాన్నకి చెబితే.. ‘ఆయన కూడా ఆవేశపడ్డారు. రెండు కళ్లతో నాకు బాగా కనపడేది.. ఒక కంటితో కూడా బాగానే కనపడుతోందని నాన్న అన్నారు. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటో అనేక తెలిస్తే చాలు’ అని నాన్న అన్నారని సైఫ్‌ పేర్కొన్నాడు. మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి 1961 నుంచి 1975 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. 46 టెస్టులు ఆడగా వాటిలో 40 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేశారు. టెస్టుల్లో 34.91 సగటుతో ఆరు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు సాధించారు. పటౌడి సెప్టెంబరు 22, 2011న మరణించారు. భారత్‌ 1967లో తొలిసారి న్యూజిలాండ్‌లో టెస్టు సిరీస్‌ గెలిచింది పటౌడీ సారథ్యంలోనే కావడం విశేషం.

మరిన్ని వార్తలు