వొజ్నియాకి పరాజయం

28 May, 2019 05:51 IST|Sakshi

 నాదల్, జొకోవిచ్‌ ముందంజ

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రెండో రోజూ సంచలన ఫలితం నమోదైంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 13వ సీడ్‌ కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో వొజ్నియాకి 6–0, 3–6, 3–6తో ప్రపంచ 68వ ర్యాంకర్‌ వెరోనికా కుదెర్‌మెతోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. రెండు గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి తొలి సెట్‌లో ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోయినా... ఆ తర్వాత తడబడి పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) 2–6, 6–1, 6–0తో వితాలియా (రష్యా)పై, నాలుగో సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) 6–3, 6–4తో పార్మెంటియర్‌ (ఫ్రాన్స్‌)పై, 12వ సీడ్‌ సెవస్తోవా (లాత్వియా) 6–1, 6–4తో కుమ్‌కుమ్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ (స్పెయిన్‌), నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో నాదల్‌ 6–2, 6–1, 6–3తో హాన్ఫ్‌మన్‌ (జర్మనీ)పై, జొకోవిచ్‌ 6–4, 6–2, 6–2తో హుర్కాజ్‌ (పోలాండ్‌)పై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

మరిన్ని వార్తలు