‘పుణే’ సూపర్‌ కింగ్స్‌ 

12 Apr, 2018 01:27 IST|Sakshi

చెన్నై నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు పుణేకు తరలింపు

కావేరి జలవివాదమే కారణం

చెన్నై: రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో అడుగు పెట్టిన చెన్నై జట్టుకు సొంతగడ్డపై కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం లభించింది. ప్రాక్టీస్‌ చూసేందుకే అభిమానులు ఎగబడగా, ఆ తర్వాత తొలి మ్యాచ్‌లో చెపాక్‌ మొత్తం పసుపు వర్ణంతో నిండిపోయింది. పైగా పరుగుల వరద పారిన మ్యాచ్‌లో సూపర్‌ కింగ్స్‌ గెలవడం వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే చెన్నై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆనందం ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది! కావేరి జలవివాదం కారణంగా నిరసనలు తీవ్ర స్థాయికి చేరడంతో అక్కడ ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ క్షేమం కాదని భావించిన బీసీసీఐ... మిగిలిన ఆరు మ్యాచ్‌లను తరలిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సీజన్‌లో సూపర్‌ కింగ్స్‌కు ఇకపై పుణే హోం గ్రౌండ్‌ కానుంది. లీగ్‌ చైర్మన్‌ రాజీవ్‌ శుక్లా ఈ విషయాన్ని నిర్ధారించారు.

చెన్నై మ్యాచ్‌ల నిర్వహణకు ప్రాథమికంగా పరిశీలించిన నాలుగు నగరాల్లో విశాఖపట్నం, తిరువనంతపురం, రాజ్‌కోట్‌ ఉన్నా... చివరకు సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం పుణేలోనే మ్యాచ్‌లు నిర్వహించేందుకు మొగ్గు చూపినట్లు సమాచారం. సరిగ్గా రెండు వారాల క్రితం ధోని బృందం ఓపెన్‌ టాప్‌ వాహనంలో చెన్నై నగరమంతా తిరిగి అభిమానులకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. అప్పుడు భద్రతపరంగా ఎలాంటి సమస్య రాకపోగా... ఇప్పుడు స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు భద్రత కేటాయించలేమంటూ స్థానిక పోలీసులు చెప్పడం నిజంగా జట్టు వీరాభిమానులను తీవ్రంగా నిరాశపరిచేదే. రెండేళ్లపాటు ఐపీఎల్‌లో ఉన్న రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని ఇప్పుడు అదే వేదికపై చెన్నైని నడిపించనున్నాడు. 

మరిన్ని వార్తలు