దేశవాళీ క్రికెట్‌ బౌలింగ్‌ దిగ్గజం రాజిందర్‌ గోయెల్‌ కన్నుమూత 

22 Jun, 2020 00:01 IST|Sakshi

27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 750 వికెట్లు తీసిన స్పిన్నర్‌

భారత జట్టులో మాత్రం దక్కని చోటు

కోల్‌కతా: భారత దేశవాళీ క్రికెట్‌ స్పిన్‌ దిగ్గజం రాజిందర్‌ గోయెల్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 77 ఏళ్లు. అనారోగ్యంతో ఆదివారం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1958 నుంచి 1985 వరకు దేశవాళీ క్రికెట్‌లో గోయెల్‌ చెరగని ముద్ర వేశారు. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ అయిన గోయెల్‌ తన 27 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 157 మ్యాచ్‌లు ఆడి 750 వికెట్లు తీశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ రికార్డు ఇప్పటికీ రాజిందర్‌ గోయెల్‌ పేరిటే ఉంది. ఆయన రంజీల్లో మొత్తం 637 వికెట్లు పడగొట్టారు. ఇంతటి విశేష ప్రతిభ కనబరిచిన రాజిందర్‌ భారత జట్టుకు మాత్రం ఆడలేకపోయారు. అయితే 1964–65 సీజన్‌లో అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన అనధికారిక టెస్టు మ్యాచ్‌ ఆడారు. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశారు.

బిషన్‌ సింగ్‌ బేడీ అద్భుతమైన స్పిన్నర్‌గా జట్టుకు అందుబాటులో ఉండటంతో సెలక్టర్లు గోయెల్‌వైపు చూడలేకపోయారు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన రాజిందర్‌ సేవలకు గుర్తింపుగా భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2017లో ‘సీకే నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం’ అందజేసింది. ఏళ్ల తరబడి హరియాణాకు ఆడిన ఆయన పంజాబ్, ఢిల్లీ జట్లకూ ప్రాతినిధ్యం వహించారు. హరియాణా క్రికెట్‌ అభివృద్ధికి ఎంతో సేవ చేసిన గోయెల్‌ మరణం తమకు తీరని లోటని హరియాణా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు కుల్తార్‌ సింగ్‌ మలిక్‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశవాళీ క్రికెట్‌కు పూడ్చలేని నష్టమని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రణ్‌బీర్‌ సింగ్‌ మహేంద్ర అన్నారు.

>
మరిన్ని వార్తలు