IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. భారత జట్టులోకి అనూహ్యంగా...!!

17 Dec, 2023 08:48 IST|Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా ఆతిథ్య జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఆదివారం(డిసెంబర్‌ 17)  జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌తో ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. 

కాగా ఈ వన్డే సిరీస్‌ నుంచి టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

ఇక దక్షిణాఫ్రికాతో వన్డేలకు చాహర్‌ స్దానాన్ని ఎవరూ ఊహించని ఆటగాడితో బీసీసీఐ భర్తీ చేసింది. బెంగాల్‌ పేసర్‌  ఆకాష్ దీప్‌ను చాహర్‌ ప్రత్యామ్నాయంగా బీసీసీఐ ప్రకటించింది. తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన ఆకాష్ దీప్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఆకాష్‌ ఈ స్దాయికి చేరడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.

ఎవరీ ఆకాష్‌ దీప్‌..?
 27 ఏళ్ల ఆకాష్ ఆకాష్‌ దీప్‌ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్‌ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్‌ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు.

ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్‌ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్‌ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్‌లోని ఓ క్రికెట్‌ ఆకాడమీలో దీప్‌ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్‌లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్‌ బాల్‌ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్‌ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్‌ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ డివిజన్‌ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్‌ లభించింది.

ఓ సారి కోల్‌కతాలోని రేంజర్స్ గ్రౌండ్‌లో మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్  డైరెక్టర్ జోయ్‌దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్‌ దీప్‌ పడ్డాడు. ఆకాష్‌ దీప్‌ బౌలింగ్‌ చేస్తున్నప్పుడు  కీపర్ స్టంప్‌ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్‌దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు. వెంటనే అండర్‌-23 కోచ్‌  సౌరాశిష్‌ను పిలిపించి ఆకాష్‌ దీప్‌ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి  బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ ప్రెసిడెంట్‌ సౌరవ్ గంగూలీ విజన్‌ 2020 పోగ్రాంకు దీప్‌ను ముఖర్జీ రిఫర్‌ చేశాడు. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది.

సౌరవ్ గంగూలీ విజన్‌ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్‌ చేసిన జాబితాలో ఆకాష్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్‌ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆకాష్‌ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్‌ తరపున  ఆకాష్‌ దీప్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, టీ20ల్లో అరంగేట్రం చేశాడు.

ఓవరాల్‌గా దేశీవాళీ క్రికెట్‌లో ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడిన ఆకాష్‌ 170 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లో ప్రస్తుతం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌-2022 మెగా వేలంలో రూ.20 లక్ష్లల కనీస్‌ ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది.

>
మరిన్ని వార్తలు