వార్నర్‌.. ఆ ప్రశ్నలకు బదులేదీ?

31 Mar, 2018 14:44 IST|Sakshi

సిడ్నీ : బాల్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంపై మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమవుతూ.. జీవితంలో తాను పెద్ద తప్పు చేశానన్న ఆసీస్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌.. అసలు విషయాలపై మాత్రం పెదవి విప్పలేదు. శనివారం మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు వార్నర్‌ మౌనంగా ఉండటంతో ఈ ఎపిసోడ్‌ మొత్తానికి ‘అసలు సూత్రధారి’ ఎవరన్న దానిపై మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

‘అసలు బాల్‌ ట్యాంపరింగ్‌ ఆలోచన ఎవరిది? సాండ్‌ పేపర్‌ను తెచ్చిందెవరు? ప్రధాన సూత్రధారి ఎవరు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? గతంలో ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారా? ట్యాంపరింగ్‌ పాల్పడటాకి గల కారణాలు ఏంటి?’ ఇలాంటి ప్రశ్నల సమయంలో వార్నర్‌ సైలెంట్‌గా ఉన్నాడు. దీంతో ఓ జర్నలిస్ట్‌ ‘మీరు సమాధానాలు చెప్పనప్పుడు అసలు ఈ సమావేశం ఎందుకు?’ అని గట్టిగా నిలదీశాడు. అయినా అదేం పట్టన్నట్లు తాను తప్పు చేశాను అంటూ పదే పదే చెబుతూ వార్నర్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

సరైన సమయంలో స్పందిస్తా.. 
ఇక మీడియా సమావేశం అనంతరం తన ట్విట్టర్‌లో వార్నర్‌ స్పందించాడు. ‘మీడియా సమావేశంలో సమాధానాలు ఇవ్వలేకపోయా. క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఓ పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం సీఏ దర్యాప్తు కొనసాగుతోంది. సీఏ ఆదేశాల ప్రకారం నేను మౌనంగా ఉన్నా. అందుకే మీడియా సమావేశంలో స్పందించలేకపోయా. క్షమాపణలు.  సీఏ నుంచి క్లియరెన్స్‌ వచ్చాక సరైన సమయంలో, సరైన వేదికపై ఆ ప్రశ్నలకు సమాధానమిస్తా’ అని ట్వీట్లు చేశాడు. దీంతో ఈ వ్యవహారంలో బయటకు రానీ ఎన్నో విషయాలు ఉన్నాయన్నది స్పష్టమౌతోంది. 

కాగా, రెండు రోజుల క్రితమే స్వదేశానికి చేరుకున్న వార్నర్‌.. స్మిత్‌ మాట్లాడిన రెండు రోజుల తర్వాత  విడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేయటం వెనుక సీఏ ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు