World Cup 2023: వరల్డ్‌కప్‌ అత్యుత్తమ జట్టు ఇదే.. కెప్టెన్‌గా కోహ్లి! రోహిత్‌కు నో ఛాన్స్‌

13 Nov, 2023 15:00 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023 తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న బెంగళూరు వేదికగా జరిగిన భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో లీగ్‌ స్టేజి ముగిసింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 160 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.

అద్బుతమైన సెంచరీతో చెలరేగిన శ్రేయస్‌ అయ్యర్‌(128 నాటౌట్‌)కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ టోర్నీ లీగ్‌ దశలో ప్రదర్శన ఆధారంగా 12 మంది సభ్యులతో కూడిన అత్యుత్తమ జట్టును క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించింది.

ఈ జట్టుకు టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ మెగా ఈవెంట్‌లో కోహ్లి దుమ్మురేపుతున్నాడు. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో 594 పరుగులు చేసిన విరాట్‌.. టోర్నీ టాప్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులో ఓపెనర్లగా క్వింటన్‌ డికాక్‌, డేవిడ్‌ వార్నర్‌ ఎంపికయ్యారు.

అదే విధంగా మూడో స్ధానంలో  కివీస్‌ యువ సంచలనం రచిన్‌ రవీంద్ర, నాలుగో స్ధానంలో విరాట్‌ ​కోహ్లికి చోటు దక్కింది. ఐదవ స్ధానంలో ప్రోటీస్‌ ఆటగాడు మార్‌క్రమ్‌కు స్ధానం లభించింది. ఇక ఆల్‌రౌండ్‌ కోటాలో గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మార్కో జానెసన్‌, రవీంద్ర జడేజాకు క్రికెట్‌ ఆస్ట్రేలియా చోటిచ్చింది. ఫాస్ట బౌలర్ల కోటాలో షమీ, బుమ్రా, మధుషంక ఉన్నారు.

అదే విధంగా ఈ జట్టులో స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా ఆడమ్‌ జంపాకు ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు అవకాశమిచ్చింది. అయితే ఈ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్న భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్లాసెన్‌ను క్రికెట్‌ పరిగణలోకి తీసుకోకపోవడం గమానార్హం.

క్రికెట్‌ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన వరల్డ్‌కప్‌ అత్యుత్తమ జట్టు ఇదే

1.క్వింటన్ డి కాక్ (వికెట్‌ కీపర్‌) (591 పరుగులు)
2.డేవిడ్ వార్నర్ (499 పరుగులు)
3.రచిన్ రవీంద్ర (565 పరుగులు, 5 వికెట్లు)
4.విరాట్ కోహ్లీ (కెప్టెన్‌) (594 పరుగులతో పాటు ఒక్క వికెట్‌)
5.ఐడెన్ మార్క్రామ్ (396 పరుగులు)
6.గ్లెన్ మాక్స్‌వెల్ (396 పరుగులు, 5 వికెట్లు)
7.మార్కో జాన్సెన్ (157 పరుగులతో పాటు 17 వికెట్లు)
8.రవీంద్ర జడేజా (111 పరుగులతో పాటు 17 వికెట్లు)
9.మహ్మద్ షమీ (17 వికెట్లు)
10.ఆడమ్ జంపా (22 వికెట్లు)
11.జస్ప్రీత్ బుమ్రా (17 వికెట్లు)
12.దిల్షాన్ మధుశంక (12వ ఆటగాడు) (21 వికెట్లు)

 

మరిన్ని వార్తలు