బెల్జియం ఈసారైనా?

24 Nov, 2017 04:41 IST|Sakshi

ఫ్రాన్స్‌తో నేటి నుంచి డేవిస్‌కప్‌ ఫైనల్‌  

పారిస్‌: 117 ఏళ్ల చరిత్ర కలిగిన డేవిస్‌ కప్‌ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచేందుకు బెల్జియం జట్టుకు మరో అవకాశం లభించింది. గతంలో రెండుసార్లు (2015లో, 1904లో) ఫైనల్‌కు చేరి రన్నరప్‌తో సరిపెట్టుకున్న బెల్జియం మూడో ప్రయత్నంలోనైనా డేవిస్‌కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మొదలయ్యే డేవిస్‌ కప్‌ ఫైనల్లో తొమ్మిదిసార్లు చాంపియన్‌ ఫ్రాన్స్‌తో బెల్జియం జట్టు తలపడుతుంది. డేవిస్‌ కప్‌ ముఖాముఖి పోరులో ఫ్రాన్స్‌ 4–3తో బెల్జియంపై ఆధిక్యంలో ఉంది. బెల్జియం ఆశలన్నీ ప్రపంచ ఏడో ర్యాంకర్‌ డేవిడ్‌ గాఫిన్‌పై ఉండగా... ఫ్రాన్స్‌ భారమంతా ప్రపంచ 15వ ర్యాంకర్‌ జో విల్‌ఫ్రైడ్‌ సోంగాపై ఉంది. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో లుకాస్‌ పుయి (ఫ్రాన్స్‌)తో గాఫిన్‌... సోంగా (ఫ్రాన్స్‌)తో స్టీవ్‌ డార్సిస్‌ తలపడతారు. 

మరిన్ని వార్తలు