రాహుల్‌కు వన్డే పగ్గాలు

1 Dec, 2023 00:37 IST|Sakshi

టి20లకు సూర్య కొనసాగింపు

రోహిత్, కోహ్లిలకు విశ్రాంతి

సాయి సుదర్శన్, రింకూలకు ఛాన్స్‌

మూడు ఫార్మాట్లకు రుతురాజ్‌

న్యూఢిల్లీ: వచ్చే నెల దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడే మూడు ఫార్మాట్లకు భారత జట్లను ఎంపిక చేశారు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో జట్టును నడిపిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ను సఫారీలోనూ కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారు. ఈ పొట్టి ఫార్మాట్‌లో జడేజాకు వైస్‌ కెప్టెన్సీ అప్పజెప్పారు.  వన్డే జట్టుకు కేఎల్‌ రాహుల్‌ను కెప్టెన్‌గా నియమించారు.

ఈ రెండు జట్లకూ భారత టాప్‌స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, కోహ్లిలు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో వన్డేల్లో ఇద్దరు కొత్త ముఖాలు బి. సాయి సుదర్శన్, రింకూ సింగ్‌లకు టీమిండియాకు ఆడే అవకాశమిచ్చారు. మిడిలార్డర్‌లో డాషింగ్‌ బ్యాటర్‌ సంజూ సామ్సన్, స్పిన్నర్‌ చహల్‌లకు వన్డే జట్టులో తిరిగి చోటు లభించగా, రుతురాజ్‌ గైక్వాడ్‌ లక్కీఛాన్స్‌ కొట్టేశాడు. పూర్తిస్థాయిలో మూడు ఫార్మాట్లకూ ఎంపికయ్యాడు.

సీమర్‌ ముకేశ్‌కూ ఇలాంటి అవకాశమే లభించింది. హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ సిరాజ్‌ను టి20, టెస్టులకు ఎంపిక చేసినప్పటికీ వన్డేల నుంచి తప్పించారు. సఫారీలో ముందుగా భారత్‌ డిసెంబర్‌ 10, 12, 14తేదీల్లో మూడు టి20లు... 17, 19, 21 తేదీల్లో మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొంటుంది. చివరగా 26 నుంచి 30 వరకు తొలిటెస్టు, జనవరి 3 నుంచి 7వరకు జరిగే రెండో టెస్టుతో పర్యటన ముగుస్తుంది.

మరిన్ని వార్తలు