యువీ.. నీ మెరుపులు పదిలం

19 Sep, 2019 14:08 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌ జట్టులో యువరాజ్‌ సింగ్‌ది ప్రత్యేక స్థానం. డాషింగ్‌ ఆటగాడిగా ముద్ర వేసుకున్న యువీ.. ఎన్నో భారత చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన యువీ.. 2007లో భారత్‌ జట్టు టీ20 వరల్డ్‌కప్‌ సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ టీ20 వరల్డ్‌కప్‌ను ఎంఎస్‌ ధోని నేతృత్వంలోని  భారత జట్టు గెలుచుకుంది. ప్రధానంగా ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ అభిమానులందరికీ ఎంతో వినోదాన్ని పంచింది. ప్రధానంగా యువరాజ్‌ సింగ్‌ మెరుపులే ఆనాటి మ్యాచ్‌లో గుర్తుకు వస్తాయి. వరుసగా ఆరు సిక్సర్లతో పరుగుల మోత మోగించాడు. ఇంగ్లిష్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 19 ఓవర్‌లో యువరాజ్‌ వరుస ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. అది జరిగి సరిగ్గా నేటికి 12 ఏళ్లు అయ్యింది.  సెప్టెంబర్‌19వ తేదీన యువరాజ్‌ ఆడిన ఇన్నింగ్స్‌ ఎప్పటికీ అభిమానుల గుండెల్లో పదిలంగా ఉంటుందనడంలో  ఎటువంటి సందేహం లేదు.

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. యువరాజ్‌ 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో బ్యాట్‌ ఝుళిపించడంతో భారత్‌ రెండొందల మార్కును సునాయాసంగా చేరింది. 18 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి భారత్‌ 171 పరుగులు చేసింది. కాగా, యువీ జోరుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇది ఇప్పటికీ అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీగా యువీ పేరిట పదిలంగా ఉంది.  ఈ మ్యాచ్‌లో భారత్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసి ఓటమి పాలైంది.

మరిన్ని వార్తలు