IPL 2024: కెప్టెన్‌గా ఆఫ‌ర్ ఇచ్చిన సీఎస్‌కే.. తిర‌స్క‌రించిన సంజూ? అశూ ఫైర్‌.. నిజ‌మిదే!

29 Nov, 2023 21:10 IST|Sakshi
ధోని- సంజూ(PC:IPL/BCCI)

ఐపీఎల్‌-2024 వేలానికి స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతున్న త‌రుణంలో స్టార్ ఆట‌గాళ్ల జ‌ట్టు మార్పు గురించి క్రీడావ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.  ముంబై ఇండియ‌న్స్ కీల‌క పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ గురించి ఆస‌క్తిక‌ర వార్త‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

గుజ‌రాత్ టైటాన్స్ సార‌థి హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై గూటికి చేర‌డం బుమ్రాకు అస్స‌లు ఇష్టంలేద‌ని వదంతులు వ్యాపిస్తున్నాయి. రోహిత్ శ‌ర్మ త‌ర్వాత తాను కెప్టెన్ కావాల‌ని భావించిన బుమ్రా క‌ల‌లు హార్దిక్ పున‌రాగ‌మ‌నం వ‌ల్ల క‌ల‌లుగానే మిగిలిపోవ‌డం ఖాయ‌మని.. అందుకే ఈ ఫాస్ట్ బౌల‌ర్ ముంబైని వీడేందుకు సిద్ధ‌ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే.. సంజూ శాంస‌న్ గురించి కూడా ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.  ఎక్స్ (ట్విట‌ర్‌) యూజ‌ర్ ఒక‌రు..  "త‌మ కెప్టెన్‌గా రావాల‌ని సీఎస్‌కే సంజూ శాంస‌న్‌కు భారీ ఆఫ‌ర్ ఇచ్చింది. అందుకు సంబంధించి ప్ర‌ణాళిక‌లు కూడా సిద్ధం చేసింది. కానీ.. సంజూ ఈ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించాడు. 

అయితే, భ‌విష్య‌త్తులో మాత్రం సంజూను సీఎస్‌కే సార‌థిగా చూడ‌టం ఖాయం" అని టీమిండియా వెట‌ర‌న్ స్పిన్న‌ర్ రవిచంద్ర‌న్ అశ్విన్ చెప్పారు  అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారానికి తెర‌తీశారు.

ఈ నేప‌థ్యంలో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ క్రికెట‌ర్‌ అశ్విన్ బుధ‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించాడు. "ఇవ‌న్నీ అస‌త్య‌పు వార్త‌లు. అబ‌ద్ధాల ప్ర‌చారానికి నా పేరును వాడ‌కండి" అంటూ గ‌ట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేప‌థ్యంలో సంజూ అభిమానులు మిశ్ర‌మంగా స్పందిస్తున్నారు.

"రాయ‌ల్స్‌ను విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తున్న సంజూకు ఆ జ‌ట్టును వీడాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ అత‌డు ధోని వార‌సుడిగా సీఎస్‌కే కెప్టెన్ అవ్వాల‌నుకున్నా అందులో త‌ప్పేం లేదు" అని కామెంట్లు చేస్తున్నారు.

కాగా గ‌త సీజ‌న్‌లో రాజ‌స్తాన్‌ను ఫైన‌ల్ చేర్చిన సంజూ.. ఈ ఎడిష‌న్లో కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేర్చ‌లేక‌పోయాడు. మ‌రోవైపు.. ధోనిని రిటైన్ చేసుకున్న చాంపియ‌న్ చెన్నై అత‌డిని మ‌రో ద‌ఫా సార‌థిగా కొన‌సాగించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు