ఆర్సీబీది అదే కథ.. అదే వ్యథ

7 Apr, 2019 19:28 IST|Sakshi

బెంగళూరు:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ రాత ఇంకా మారలేదు. మళ్లీ పాత కథే పునరావృతమైంది. గెలుపు కోసం వచ్చే మ్యాచ్‌.. వచ్చే మ్యాచ్‌ అంటూ తీవ్రంగా నిరీక్షిస్తున్న ఆర్సీబీ అభిమానికి మరోసారి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఓటముల్లో డబుల్‌ హ్యాట్రిక్‌ కొట్టేసింది ఆర్సీబీ. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆర్సీబీ నిర్దేశించిన 150 పరుగుల టార్గెట్‌ను ఢిల్లీ 18.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విజయంలో శ్రేయస్‌ అయ్యర్‌(67‌: 50 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పాత్ర పోషించాడు. అతనికి జతగా పృథ్వీ షా(28; 22 బంతుల్లో 5ఫోర్లు), ఇన్‌గ్రామ్‌(22; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది.  కోహ్లి(41;33 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు), అలీ(32;18  బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లు) ఆకట్టుకోవడంతో ఆర్సీబీ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో రబడ విజృంభించి బౌలింగ్‌ చేశాడు. డివిలియర్స్‌, కోహ్లి, అక్ష్‌దీప్‌ నాథ్‌, పవన్‌ నేగీ వికెట్లను సాధించి ఆర్సీబీ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అతనికి జతగా క్రిస్‌ మోరిస్‌ రెండు వికెట్లు తీయగా, అక్షర్‌ పటేల్‌, లామ్‌చెన్‌లకు తలో వికెట్‌ దక్కింది.

5 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు..

ఢిల్లీ విజయానికి 6 పరుగులు కావాల్సిన తరుణంలో మూడు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ స్కోరు 145 పరుగుల వద్ద ఉండగా శ్రేయస్‌ అయ్యర్‌ అనవసరపు షాట్‌ కొట్టి ఔట్‌ కాగా, ఆపై మూడు బంతుల వ్యవధిలో క్రిస్‌ మోరిస్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. ఈ రెండు వికెట్లు నవదీప్‌ షైనీ సాధించాడు. ఇక సిరాజ్‌ వేసిన తదుపరి ఓవర్‌లో రిషభ్‌ పంత్‌(18) సైతం పెవిలియన్‌ చేరడంతో ఢిల్లీ శిబిరంలో ఆందోళన రేకెత్తింది. అయితే సిరాజ్‌ వేసిన అదే ఓవర్‌ ఐదో బంతికి అక్షర్‌ పటేల్‌ ఫోర్‌ కొట్టడంతో ఢిల్లీ విజయం సాధించింది.

>
మరిన్ని వార్తలు