నాలో సత్తా మిగిలే ఉంది

21 Dec, 2018 03:45 IST|Sakshi

యువరాజ్‌ సింగ్‌ వ్యాఖ్య

ముంబై: ఇటీవలి ఐపీఎల్‌ వేలంలో ఫ్రాంచైజీలు తనను తీసుకునేందుకు మొగ్గు చూపకపోవడంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పందించాడు. ఈ విషయం కొంత బాధించినా... తనలాంటి వారి కంటే కొత్త తరం ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు ఎక్కువ దృష్టిపెడతాయి కాబట్టి సర్దిచెప్పుకొన్నానని అతడు పేర్కొన్నాడు. 37 ఏళ్ల యువరాజ్‌ను మూడు రోజుల క్రితం జరిగిన వేలంలో రెండో రౌండ్‌లో రూ.కోటి ప్రాథమిక ధరకు ముంబై ఇండియన్స్‌ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ... ‘క్రికెట్‌ పట్ల వ్యామోహంతో పాటు నాలో ఇంకా సత్తా ఉంది కాబట్టే ఆడగలుగుతున్నా.

ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నట్లు మనసులో ఏమూలనో ఉండేది. అదే జరగబోతోంది. ఫ్రాంచైజీ యజమాని అనంత్‌ అంబానీ నా గురించి మంచి మాటలు చెప్పడం మరింత ఆనందాన్నిచ్చింది. గతేడాది లీగ్‌లో పంజాబ్‌ తరఫున విఫలమైంది నిజమే. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో స్థిరమైన స్థానం లేకపోవడమే దీనికి కారణం. ఈసారి మాత్రం అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా. ముంబై ఫ్రాంచైజీలోని సచిన్, జహీర్, కెప్టెన్‌ రోహిత్‌లతో చాలా మ్యాచ్‌లు ఆడా. మనకు ఎవరైనా మద్దతుగా ఉంటే బాగా ఆడేందుకు అది ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది’ అని వివరించాడు. 

మరిన్ని వార్తలు