జొకోవిచ్‌ కొత్త చరిత్ర

4 Jun, 2019 03:50 IST|Sakshi

వరుసగా పదోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిక

ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌  

పారిస్‌: ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్‌ శకంలో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–2, 6–2తో జాన్‌ లెనార్డ్‌ స్ట్రాఫ్‌ (జర్మనీ)పై అలవోకగా గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. 2005 నుంచి క్రమం తప్పకుండా ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్‌ 2010 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు క్వార్టర్‌ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు.


బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)తో జొకోవిచ్‌ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో జ్వెరెవ్‌ 3–6, 6–2, 6–2, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్‌  ఫాగ్‌నిని (ఇటలీ)పై... ఏడో సీడ్‌ నిషికోరి (జపాన్‌) 6–2, 6–7 (8/10), 6–2, 6–7 (8/10), 7–5తో బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై, నాలుగో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–4, 6–4, 6–2తో మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలుపొంది క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్‌లో నిషికోరి 1–4, 3–5తో వెనుకబడినప్పటికీ పుంజుకొని నెగ్గడం విశేషం. క్వార్టర్‌   ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాఫెల్‌ నాదల్‌తో నిషికోరి తలపడతాడు.

క్వార్టర్స్‌లో హలెప్, కీస్‌
మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ సిమోనా      హలెప్‌ (రొమేనియా), ఎనిమిదో సీడ్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 14వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా), అన్‌సీడెడ్‌ అనిసిమోవా (అమెరికా) క్వార్టర్‌ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో హలెప్‌ 6–1, 6–0తో స్వియాటెక్‌ (పోలాండ్‌)పై, యాష్లే బార్టీ 6–3, 3–6, 6–0తో సోఫియా కెనిన్‌ (అమెరికా)పై, కీస్‌ 6–2, 6–4తో సినియకోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, 17 ఏళ్ల అనిసిమోవా 6–3, 6–0తో క్వాలిఫయర్‌ అలియోనా బొల్సోవా (స్పెయిన్‌)పై విజయం సాధించారు. మూడో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌)పై నెగ్గిన సినియకోవా, అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించిన సోఫియా కెనిన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాత్రం తడబడ్డారు.  

మరిన్ని వార్తలు