ఫైనల్లో జొకోవిచ్, మెద్వెదెవ్‌

10 Sep, 2023 01:19 IST|Sakshi

సెమీస్‌లో ఓడిన నంబర్‌వన్‌ అల్‌కరాజ్‌ 

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌  

నేడు అర్ధరాత్రి 1.30నుంచి తుది పోరు  

న్యూయార్క్‌: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌కు స్టార్‌ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ మరో అడుగు దూరంలో నిలిచాడు. యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో పదో సారి ఫైనల్‌కు చేరిన ఈ సెర్బియా దిగ్గజం తుది పోరుకు సన్నద్ధమయ్యాడు. అయితే అతని టైటిల్‌ వేటలో రష్యా ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ అడ్డుగా ఉన్నాడు. ఇదే వేదికపై తన ఏకైక గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన మెద్వెదెవ్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు.

రెండేళ్ల క్రితం 2021లో యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌ వీరిద్దరి మధ్య జరిగింది. అనూహ్య ప్రదర్శనతో చెలరేగిన మెద్వెదెవ్‌ వరుస సెట్‌లలో జొకోను ఓడించి విజేతగా నిలిచాడు. ఈ సారి గత పోరుకు ప్రతీకారం తీర్చుకోవాలని నొవాక్‌ పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం అర్ధ రాత్రి జరిగిన తొలి సెమీ ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–2, 7–6 (7/4) స్కోరుతో అమెరికన్‌ కుర్రాడు బెన్‌ షెల్టన్‌పై విజయం సాధించగా... మెద్వెదెవ్‌ వరల్డ్‌ నంబర్‌వన్, ఈ ఏడాది వింబుల్డన్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)కు షాక్‌ ఇచ్చాడు. సెమీస్‌ పోరులో మెద్వెదెవ్‌ 7–6 (7/3), 6–1, 3–6, 6–3తో అల్‌కరాజ్‌ను ఓడించాడు.  

ఏకపక్షంగా... 
గ్రాండ్‌స్లామ్‌లో హార్డ్‌కోర్ట్‌ వేదికపై తన 100వ మ్యాచ్‌ బరిలోకి దిగిన జొకోవిచ్‌ స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు. 149 కిలోమీటర్ల వేగంతో మెరుపు సరీ్వస్‌లే బలంగా షెల్టన్‌ పోటీ ఇచ్చినా చివరకు దిగ్గజం ముందు తలవంచక తప్పలేదు. మూడో సెట్‌లో ఒక దశలో 5–4తో సెట్‌ కోసం సర్వీస్‌ చేసినా...జొకో ప్రశాంతంగా ప్రత్య ర్థిని నిలువరించగలిగాడు. 2 గంటల 41 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ చెరో 5 ఏస్‌లు సంధించారు.

అయితే జొకోవిచ్‌ 25 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌తో పోలిస్తే 43 తప్పులు చేసిన షెల్టన్‌ మూల్యం చెల్లించుకున్నాడు.  36 ఏళ్ల జొకోవిచ్‌కు ఇది 36వ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ కావడం విశేషం కాగా...టైటిల్‌ గెలిస్తే ఓపెన్‌ ఎరాలో అతి పెద్ద వయసులో యూఎస్‌ ఓపెన్‌ నెగ్గిన ఆటగాడిగా నిలుస్తాడు. యూఎస్‌ ఓపెన్‌లో గతంలో 9 సార్లు ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ 3 టైటిల్స్‌ సాధించి 6 సార్లు ఓడాడు.  

మరో టైటిల్‌ వేటలో... 
రెండో సెమీస్‌లో సగటు అభిమాని ఊహించని ఫలితం వచ్చింది. ఈ సీజన్‌లో రెండు సార్లు అల్‌కరాజ్‌ చేతిలో ఓడిన రష్యా ఆటగాడు అసలు సమరంలో సత్తా చాటాడు. జొకోవిచ్‌–అల్‌కరాజ్‌ మధ్య టైటిల్‌ పోరు అంటూ సాగిన అంచనాలను అతను బద్దలుకొట్టాడు.

తొలి సెట్‌ హోరాహోరీగా సాగినా ఒక దశలో 19 పాయింట్లలో 16 నెగ్గి మెద్వెదెవ్‌ టైబ్రేక్‌లో సెట్‌ సొంతం చేసుకున్నాడు. మూడో సెట్‌లో అల్‌కరాజ్‌ అవకాశం అందిపుచ్చుకున్నా, ఆ తర్వాత అతని జోరు సాగలేదు. మెద్వెదెవ్‌ 9 ఏస్‌లు కొట్టగా, అల్‌కరాజ్‌ ఒక్క ఏస్‌ కూడా కొట్టలేకపోవడం ఈ మ్యాచ్‌లో అతని బలహీనతను చూపించింది. మెద్వెదెవ్‌ 10 డబుల్‌ఫాల్ట్‌లు చేసినా తుది ఫలితంపై అది ప్రభావం చూపించలేదు.  

మరిన్ని వార్తలు