యూరోప్‌ జట్టుదే లేవర్‌ కప్‌ 

25 Sep, 2018 00:30 IST|Sakshi

13–8తో  ప్రపంచ జట్టుపై విజయం

షికాగో (అమెరికా): పురుషుల టెన్నిస్‌లో యూరోప్‌ ఆటగాళ్ల ఆధిపత్యాన్ని చాటుకుంటూ వరుసగా రెండో ఏడాది రాడ్‌ లేవర్‌ కప్‌ను యూరోప్‌ జట్టు దక్కించుకుంది. ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), జొకోవిచ్‌ (సెర్బియా), జ్వెరెవ్‌ (జర్మనీ), దిమిత్రోవ్‌ (బల్గేరియా), గాఫిన్‌ (బెల్జియం), ఎడ్మండ్‌ (బ్రిటన్‌)లతో కూడిన యూరోప్‌ జట్టు 13–8తో ప్రపంచ జట్టుపై గెలుపొందింది. ప్రపంచ జట్టుకు అండర్సన్‌ (దక్షిణాఫ్రికా), ఇస్నెర్‌ (అమెరికా), కిరియోస్‌ (ఆస్ట్రేలియా), జాక్‌ సోక్‌ (అమెరికా), ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా), టియాఫో (అమెరికా) ప్రాతినిధ్యం వహించారు.

చివరి రోజు మూడు మ్యాచ్‌లు జరుగగా... రెండింటిలో యూరోప్‌ ఆటగాళ్లు గెలిచి కప్‌ను సొంతం చేసుకున్నారు. డబుల్స్‌ మ్యాచ్‌లో ఇస్నెర్‌–జాక్‌ సోక్‌ (వరల్డ్‌ టీమ్‌) ద్వయం 4–6, 7–6 (7/2), 11–9తో ఫెడరర్‌–జ్వెరెవ్‌ (యూరోప్‌) జోడీని ఓడించింది. ఆ తర్వాత సింగిల్స్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–7 (5/7), 7–6 (8/6), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఇస్నెర్‌ (వరల్డ్‌ టీమ్‌)పై గెలిచాడు. చివరి మ్యాచ్‌లో జ్వెరెవ్‌ 6–7 (3/7), 7–5, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో అండర్సన్‌ (వరల్డ్‌ టీమ్‌)పై విజయం సాధించి యూరోప్‌ విజయాన్ని ఖాయం చేశాడు. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీలో యూరోప్‌ జట్టు ఏడు మ్యాచ్‌ల్లో... వరల్డ్‌ టీమ్‌ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.  

మరిన్ని వార్తలు