టీమిండియా మ్యాచ్‌ గెలవాలంటే..!

9 Jul, 2019 20:43 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం గం 6.30 ని.లకు వర్షం కురవడంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపి వేశారు. ఆ సమయానికి కివీస్‌ 46.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోవడంతో అంపైర్లు, రిఫరీ సమీక్షలు జరుపుతున్నారు. ఒకవేళ వరుణుడు కరుణించి అవుట్‌ ఫీల్డ్‌ ఇబ్బంది ఏమీ లేకపోతే దాదాపు ఈ రోజు మ్యాచ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. రిజర్వ్‌ డేను చివరి అవకాశంగా మాత్రమే ఉపయోగించుకోవాలని ఐసీసీ నిబంధనలు చెబుతున్న తరుణంలో మ్యాచ్‌ జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటకే దాదాపు రెండు గంటల ఆట సాధ్యం కాకపోవడంతో ఓవర్లను కుదించే అవకాశం ఉంది. అదే సమయంలో న్యూజిలాండ్‌ తిరిగి బ్యాటింగ్‌ కొనసాగించే అవకాశం లేదు.

రాత్రి గం. 8.30 ని.ల నుంచి గం. 9.00 మధ్యలో మ్యాచ్ ప్రారంభమైతే మాత్రం ఓవర్లను కుదిస్తారు. మ్యాచ్‌లో ఈరోజే ఫలితం తేలాలంటే మాత్రం భారత్ కనీసం 20 ఓవర్లు ఆట ఆడాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ ఇప్పటికే 20 ఓవర్ల ఆట ఆడేసినందున భారత్ కూడా కనీసం 20 ఓవర్లు ఆడాలి. ఒకవేళ భారత జట్టు 20 ఓవర్లు మాత్రమే ఆట ఆడాల్సి వస్తే.. అప్పుడు 148 పరుగులు చేయాల్సి వస్తుంది. అంటే 120 బంతుల్లో 148 పరుగులు చేయాల్సి ఉంటుందని డక్‌వర్త్‌ లూయిస్‌ నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ భారత జట్టు ఈరోజు కనీసం 20 ఓవర్లు ఆడలేకపోతే మ్యాచ్ రేపు కొనసాగుతుంది. అంటే.. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే కొనసాగుతుంది. రిజర్వ్ డే రోజున కూడా వర్షం పడి మ్యాచ్‌ ఫలితం రాకపోతే లీగ్‌లో టాప్‌లో నిలిచిన భారత్‌ ఫైనల్‌కు చేరుతుంది.

మరిన్ని వార్తలు