యాషెస్‌ చరిత్రలో రెండోసారి..!

8 Jan, 2018 16:56 IST|Sakshi

సిడ్నీ: యాషెస్‌ సిరీస్‌ను ఆతిథ్య ఆస్ట్రేలియా 4-0తో గెలిచిన సంగతి తెలిసిందే. ఈరోజు(సోమవారం) ముగిసిన చివరిదైన ఆఖరిటెస్టులో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 123 పరుగులు తేడాతో విజయ సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా ఆసీస్‌ సిరీస్‌ను ఎగరేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ల ముందు నిలవలేకపోయిన ఇంగ్లిష్‌ ఆటగాళ్లు భారీ మూల్యం చెల్లించుకుని సిరీస్‌ను భారంగా ముగించారు.


ఆసీస్‌ బౌలర్ల ఆధిపత్యం..

ఈ సిరీస్‌ విజయంలో ఆస్ట్రేలియా బౌలర్ల పాత్ర ఎంతో కీలకమైంది. కనీస ప్రదర్శన ఇవ్వలేకపోయిన ఇంగ్లీష్‌ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపని ఆసీస్‌ గడ్డపై.. ఆతిథ‍్య జట్టుకు చెందిన నలుగురు బౌలర్లు ఒక్కొక్కరు ఇరవైకి పైగా వికెట్లు సాధించారు. అత్యధికంగా ప్యాట్‌ కమ్మిన్స్‌ (23) వికెట్లు సాధించగా,  స్టార్క్‌ (22),   లియాన్‌ (21), హజిల్‌వుడ్‌ (21) వికెట్లు సాధించారంటే ఆసీస్‌ బౌలింగ్‌ ఎంత దుర్భేద్యంగా ఉందో అర్ధం అవుతుంది. ఇలా  ఒక యాషెస్‌ చరిత్రలో నలుగురు బౌలర్లు ఇరవైకి పైగా వికెట్లు సాధించడం ఇది రెండోసారి. 2006-07 జరిగిన యాషెష్‌ సిరీస్‌లో స్టువార్ట్‌ క్లార్క్‌(26), షేన్‌ వార్న్‌(23), మెక్‌గ్రాత్‌(21), బ్రెట్‌ లీ(20) ఈ ఘనత సాధించారు. ఆపై దశాబ్దం కాలం తరువాత ఆస్ట్రేలియా తిరిగి ఆ ఫీట్‌ను అందుకుంది.

బ్యాట్స్‌మెన్‌ హవా

ఆసీస్‌ బౌలర్లకు పోటీగా బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టారు. కెప్టెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ అద్భుత ఫామ్‌ను యాషెస్‌ సిరీస్‌లోనూ కొనసాగించాడు. ఈ సిరీస్‌లో అత్యధికంగా 687 పరుగులతో ఆగ్రస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానాలలో షాన్‌ మార్ష్‌ (445), డేవిడ్‌ వార్నర్‌ (441) పరుగులతో తర్వాతి స్థానాలలో ఉన్నారు. కీలక సమయాలలో  ఉస్మాన్‌ ఖవాజా, మిచెల్‌ మార్ష్‌, షాన్‌లు రాణించడంతో ఆసీస్‌కు తిరుగేలేకుండా పోయింది.

సమిష్టిగా విఫలమైన ఇంగ్లండ్‌

 ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌కు వివాదం కారణంగా బెన్‌ స్టోక్స్‌ను దూరం కావడంతో ఇంగ్లండ్‌కు ఆ లోటు తీవ్రంగా కనబడింది. ఈ సిరీస్‌లో కెప్టెన్‌ జోరూట్‌  పోరాట పటిమను ప్రదర్శించినా మిగతా బ్యాట్స్‌మ్‌న్‌ సహకారం అందిచక పోవటం ఇంగ్లండ్‌ ఘోర ఓటమికి కారణంగా చెప్పవచ్చు. పరిస్థితులకు తగ్గట్టు ఆటను ప్రదర్శించే మొయిన్‌ అలీ ఈ సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ఇంత దారుణంగా ఇంగ్లండ్‌ ఒక సిరీస్‌ను కోల్పోవడం గత కొన్నేళ్లలో తరువాత ఇదే తొలిసారిగా చెప్పొచ్చు.

మరిన్ని వార్తలు