Sakshi News home page

సీఎం పేరు ‘జై శ్రీరామ్’ అన్నా ఆశ‍్చర్యమేమీ లేదు!

Published Mon, Jan 8 2018 4:54 PM

Karnataka BJP leader Arvind Limbavali Criticises cm Siddaramaiah - Sakshi

సాక్షి, బెంగళూరు: ఓ వైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతుండగా మరోవైపు హిందుత్వ అజెండా తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో కర్ణాటక బీజేపీ నేత అరవింద్ లింబావలి సీఎం సిద్ధారామయ్యపై ఓ సెటైర్ పేల్చారు. అసలేమైందంటే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కర్ణాటకలో పర్యటించనున్న నేపథ్యంలో ముందుగా మీ రాష్ట్రంలో ఆకలి చావుల గురించి పట్టించుకుంటే మంచిదని సిద్ధరామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దాంతో పాటుగా కర్ణాటకలో యోగి ఆదిత్యనాథ్ పర్యటనకు ముందురోజు హిందుత్వ అజెండాపై పలు వ్యాఖ్యలు చేశారు.

సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ నేత అరవింద్ లింబావలి ఘాటుగా స్పందించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి కర్ణాటక పర్యటనకు వస్తారన్న ముందురోజు మా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హిందుత్వ అజెండా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. యోగి రెండోసారి కర్ణాటకలో పర్యటించినప్పుడు సిద్ధరామయ్య తన పేరులో రామ్, సిద్ధా అని ఉందని పేర్కొన్నట్లు గుర్తుచేశారు. యోగి మరోసారి కర్ణాటకలో పర్యటిస్తే సిద్ధరామయ్య తనపేరును జై శ్రీరామ్ అని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంల కర్ణాటక పర్యటనల నేపథ్యంలోనే సిద్ధరామయ్య హిందుత్వ పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు.

కాగా, యూపీలో ఆకలి చావులు ఎక్కువగా ఉన్నాయని.. కర్ణాటకలోని రేషన్‌ షాపులను, ఇందిరా క్యాంటీన్‌లను సందర్శించి ఆదర్శంగా తీసుకోండంటూ సిద్ధరామయ్య యోగికి ఓ సలహా ఇవ్వగా, ఆదిత్యానాథ్‌ కూడా స్పందించిన విషయం తెలిసిందే. ‘మీ (కాంగ్రెస్) హయాంలోనే కర్ణాటకలో రైతుల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని విన్నాను. నిజాయితీ పరులైన అధికారుల బదిలీలు, వారి మరణాలకు కూడా మీ ప్రభుత్వమే కారణమవుతుందంట కదా’ అంటూ యోగి కౌంటర్‌ ఇచ్చారు. తాజాగా బీజేపీ నేత అరవింద్ లింబావలి సీఎం సిద్ధరామయ్య తీరును తప్పుపట్టారు.

Advertisement

What’s your opinion

Advertisement